No Warden in Govada BC Hostel: గోవాడ బీసీ హాస్టల్లో రాత్రివేళ కనిపించని సిబ్బంది.. జనసైనికుల అగ్రహం - Janasena Leaders Fires on YCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 5:04 PM IST
No Warden in Govada BC Hostel: అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని గోవాడ బీసీ బాలుర హాస్టల్లో సిబ్బంది లేకపోవటం అక్కడకు పరిశీలనకు వెళ్లిన జనసేన పార్టీ నాయకులను విస్తుపోయేలా చేసింది. అభం శుభం తెలియని చిన్న పిల్లలు ఉండే హాస్టల్లో.. వార్డెన్‌తో పాటు ఏ కిందిస్ధాయి సిబ్బంది కూడా విధుల్లో లేకపోవడం వారిని ఆశ్చర్యపరిచింది. అసలేం జరిగిందంటే.. చోడవరం నియోజకవర్గంలోని కొన్ని హాస్టళ్లను జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. అక్కడ ఉన్న వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
ఈ క్రమంలో గోవాడ బీసీ హాస్టల్‌కు వెళ్లిన వారికి అక్కడ సిబ్బంది కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై హాస్టల్లో ఉండే పిల్లలను ఆరా తీశారు. హాస్టల్లో ఇద్దరు సిబ్బంది ఉంటారని.. వార్డెన్ ప్రతి నెలా జరిగే ఉన్నతాధికారుల మీటింగ్‌కు జిల్లా కేంద్రానికి వెళ్లాడని పిల్లలు తెలిపారు. ఇంకో వ్యక్తి ఇతర కారణాలతో బయటకు వెళ్లాడని పేర్కొన్నారు. మరి వాచ్మెన్ ఎక్కడ అని జనసేన నాయకులు ప్రశ్నించగా.. తమ హాస్టల్‌కు వార్డెన్ ఎవరూ లేరని పిల్లలు తెలిపారు. సిబ్బంది లేకపోవడంతో ఆడుకుంటునో.. మరే ఇతర కారణంతోనో హాస్టల్ పక్కనే ఉన్న పెద్ద కాల్వ వైపో, ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి మీదికో పిల్లలు వెళ్తే పరిస్థితి ఏంటని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది బాధ్యతారాహిత్యంపై ఉన్నతాధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని.. హాస్టల్‌కు వాచ్‌మెన్‌ను నియమించాలని వారు డిమాండ్ చేశారు.