కోడి కత్తి దాడి కేసులో కుట్రకోణం లేదు - సరైన కారణం చూపకుండా జగన్ హైకోర్టును ఆశ్రయించారు : ఎన్ఐఏ

🎬 Watch Now: Feature Video

thumbnail

NIA Filed Counter to Jagan Petition on Kodi Kathi Case: కోడి కత్తి దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ సీఎం జగన్‌.. హైకోర్టులో సింగిల్‌ జడ్జి వద్ద దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని... ఎన్ఐఏ పేర్కొంది. ఈ మేరకు ఎన్ఐఏ ఇన్‌స్పెక్టర్‌ బీవీ శశిరేఖ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మాత్రమే.. విచారణ జరపాలని తెలిపారు. ఈ వ్యవహారంలో వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చాయని గుర్తుచేశారు. జగన్‌పై కోడి కత్తితో దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు పాత్ర తప్ప మరో వ్యక్తి, రాజకీయ పార్టీ ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు లభ్యం కాలేదని కౌంటర్‌లో ఎన్ఐఏ పేర్కొంది. 

ఈ కేసులో ఏ ఒక్క అంశాన్నీ విడిచిపెట్టకుండా దర్యాప్తు చేశామని., జగన్‌పై దాడిలో కుట్ర కోణం లేదని వెల్లడించింది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జగన్‌ పిటిషన్‌ను కొట్టేయాలని కోరింది. లోతైన దర్యాప్తు అభ్యర్థనను నిరాకరిస్తూ విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ఇచ్చిన స్టేని కూడా ఎత్తివేయాలని అభ్యర్థించింది. తనపై దాడి కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ ఈ ఏడాది జూన్‌ 25న జగన్ పిటిషన్ దాఖలు చేయగా... కోర్టు కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఈ వ్యాజ్యంపై అక్టోబర్‌ 10న విచారణ జరిపి..  కేసును 8 వారాల పాటు నిలుపుదల చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో ఎన్ఐఏ తాజాగా కౌంటర్‌ దాఖలు చేసింది. ఏ అంశాన్నీ వదలకుండా ఈ కేసులో లోతైన దర్యాప్తు నిర్వహించినట్లు తెలిపింది. పూర్తి స్థాయి అభియోగపత్రం దాఖలుచేశామని ఎన్ఐఏ వెల్లడించింది. సాక్షి దినేష్‌కుమార్‌ చెప్పిన వివరాలను ఎన్‌ఐఏ కోర్టు నమోదుచేసింది. ఈ దశలో సహేతుకమైన కారణం లేకుండా పిటిషనర్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారని.. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాన్ని కొట్టేయండి’ అని ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్‌ కౌంటరు దాఖలు చేశారు.

Last Updated : Nov 29, 2023, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.