జీవో 217ను రద్దు చేసి, గత ప్రభుత్వ పథకాలను మళ్లీ తెస్తాం - కరెంట్ చార్జీలు తగ్గిస్తాం! మత్స్యకారులకు లోకేశ్ భరోసా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 5:31 PM IST
|Updated : Dec 9, 2023, 5:56 PM IST
Nara Lokesh Interaction With Fishermen: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకారులకు గతంలో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్ధరిస్తామని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్లపురంలో లోకేశ్ మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ హయాంలో ఎదురవుతున్న సమస్యలను లోకేశ్‌కు మత్సకారులు చెప్పుకున్నారు. వేటకు వెళ్లి చనిపోయినవారి కుటుంబసభ్యులను ఆదుకోవాలని మత్స్యకారులు కోరారు. వేటకు వెళ్లి చనిపోతే వైద్యుడి ధ్రువపత్రం అడుగుతున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వలల ధరలు బాగా పెరిగాయని తగ్గేలా చూడాలని అన్నారు.
తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులను లోకేశ్ వారికి వివరించారు. సీఎం జగన్‌కు ఉల్లిగడ్డకు, బంగాళాదుంపకు తేడా తెలియదని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇలాంటి సీఎం వచ్చి ఇక రైతుల కష్టాలు ఏం తీరుస్తారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఏపీ మత్స్యకారప్రదేశ్గా చేస్తే, జగన్ హయాంలో ఫినిష్ ఆంధ్రాగా మార్చారని లోకేశ్ అన్నారు. బోటు, వలలు, డీజిల్ సబ్సిడీ, బీమా, 50 ఏళ్లకే పింఛన్, వేట నిషేధం సమయంలో సాయం ఇలా టీడీపీ హయాంలో మత్స్యకారులకు 800 కోట్లు సబ్సిడీ రూపంలో అందించామని చెప్పారు.
వైసీపీ హయాంలో మత్స్యకారులకు చేసింది ఏమీ లేదు అన్నారు. తుపానుతో మత్స్యకారులు, రైతులు నష్టపోతే పరామర్శించే మనస్సు జగన్‌కి రాలేదని, పరదాలు కట్టుకొని పంట పొలాలు పరిశీలించడానికి వెళ్లారని ఎద్దేవా చేశారు. మత్స్యకారుల పొట్ట కొడుతూ, వంద హెక్టార్ల పైన విస్తీర్ణం ఉన్న చెరువులను బహిరంగ వేలం వేస్తామంటూ జగన్ తెచ్చిన జీవో 217ను టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేస్తామని అన్నారు. జగన్‌కి బీసీలు అంటే చిన్న చూపు అని, 26 వేల మంది బీసీలపై కేసులు పెట్టారని చెప్పారు.
టీడీపీ హయాంలో మత్స్యకారులు వేటకు వెళ్లి చనిపోతే వెంటనే ఆ కుటుంబానికి 5 లక్షల ఆర్ధిక సాయం అందించే వాళ్లమని, జగన్ ప్రభుత్వం ఎలాంటి సాయం అందించడం లేదని మండిపడ్డారు. పాదయాత్ర చేసింది జగనా లేక డూప్నా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. మత్స్యకారులను గుండెల్లో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత తాను తీసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామన్న లోకేశ్, మత్స్యకారుడు చనిపోతే 30 రోజుల్లో పరిహారం ఇస్తామన్నారు. కరెంటు ఛార్జీలు తగ్గించి పేద కుటుంబాలకు అండగా ఉంటామని, కాలుష్యం లేని పరిశ్రమలు తీసుకువస్తామని నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. తీరప్రాంతాల్లో సముద్రంలో కలిసే నీటిని శుద్ధి చేస్తామని అన్నారు.