Farmers Protest: ఆ రిజర్వాయర్‌కు భూములివ్వమన్న రైతులు.. మద్దతు తెలిపిన బైరెడ్డి సిద్దార్థరెడ్డి - శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి న్యూస్
🎬 Watch Now: Feature Video
Mallikarjuna Reservoir Survey Farmers Protest: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో నిర్మించతలపెట్టిన మల్లికార్జున జలాశయానికి ఎలాంటి సమాచారం లేకుండా భూములు సర్వే చేయడాన్ని నిరసిస్తూ నంద్యాల కలెక్టరు కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో విలువైన తమ భూములను రిజర్వాయర్‌కు ఎలా తీసుకుంటారని రైతులు ప్రశ్నించారు. తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదే లేదని రైతులు స్పష్టం చేశారు. ఈ రిజర్వాయర్ కారణంగా సుమారు 10వేల ఎకరాల తమ పంట పొలాలు నీట మునిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ.. నిరసన చేపట్టారు. కాగా.. రైతుల ధర్నాకు నందికొట్కూరు వైసీపీ నాయకుడు, శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మద్దతు తెలిపారు. పార్లమెంటు సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డితో కలిసి.. ఈ విషయాన్ని జిల్లా కలెక్టరు మనీజిర్ జిలానీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. రైతులతో చర్చించిన తర్వాతే ప్రతిపాదన పంపుతామని హామీ ఇచ్చారు. అవసరమైతే సర్వేను అడ్డుకుంటామని బైరెడ్డి సిద్ధార్థ అన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని.. సిద్ధార్థ తెలిపారు.