వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క నెలలో ₹291 కోట్ల పేదల పింఛన్ సొమ్ము కాజేసింది : నాదెండ్ల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 7:11 PM IST
Nadendla Manohar Fire on YSRCP Govt Lies: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న అసత్య ప్రచారాలు, అబద్ధాలపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అసత్యాలతో ప్రజలను దారుణంగా మోసగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం విజయోత్సవ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నందుకు జగన్ ప్రభుత్వంలో అలజడి మొదలైందని మనోహర్ పేర్కొన్నారు.
Nadendla Manoha Comments: ''ముందుగా ముఖ్యమంత్రి జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సామాజిక భద్రతపైన ప్రతి ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని మన పెద్దలు రాజ్యాంగంలో రాశారు. కానీ, ఈ జగన్ ప్రభుత్వం ఆ బాధ్యతను ఉల్లఘించి, రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేస్తోంది. సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో మాయాజాలం చేస్తోంది. నవంబర్‌లో 54.69 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. డిసెంబర్‌లో 54.50 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. నెల రోజుల్లో 19 వేల మందికి పింఛన్లు కోత పెట్టారు. అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు నిలిపివేశారు. పింఛన్ల కోత ద్వారా రూ.291 కోట్లు కాజేశారు. ఇటీవల కేబినెట్ భేటీలో 54.69 లక్షల పింఛన్లకు ఆమోదం తెలిపారు. కానీ, మంత్రి బయటకు వచ్చాక 65 లక్షల పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. యువగళం సభలో పవన్ పాల్గొంటే ప్రభుత్వంలో అలజడి మొదలైంది. రాజకీయ వ్యూహంలో భాగంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. జనసేన-టీడీపీ కలిస్తే తమకు భవిష్యత్తు ఉండదని వైఎస్సార్సీపీ భయం పడుతుంది. సంక్రాంతి కల్లా ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది.'' అని నాదెండ్ల మనోహర్ అన్నారు.