CM Chandrababu Distribute Pension in NarasaraoPeta : ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ సొమ్మును రెండింతలు పెంచింది. వృద్ధులకు, వితంతువులు, ఇతరత్రాలకు రూ.4వేలు, విభిన్న ప్రతిభావంతులకు రూ.6వేలు. మంచానికి పరిమితమైన వారితో పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి రూ.15వేలు ఇస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలోని సామాజిక పింఛనర్ల ఇళ్లలో, ఒకరోజు ముందే నూతన సంవత్సర శోభ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం జనవరి 1కి, బదులు డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేస్తోంది.
స్వయంగా కాఫీ పెట్టిన సీఎం చంద్రబాబు : ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. యల్లమందలోని పింఛను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి సీఎం స్వయంగా పింఛను అందజేశారు. శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన సీఎం పింఛను నగదు ఇచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని సీఎం అధికారులకు సూచించారు. శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని ఆదేశించారు. దూర విద్య ద్వారా చదువు కొనసాగించాలని శారమ్మ కుమారుడికి సూచించారు.
ఆ తర్వాత సీఎం చంద్రబాబు మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లారు. ఏడుకొండలు ఇంట్లో చంద్రబాబు స్వయంగా కాఫీ తయారు చేశారు. తాను పెట్టిన కాఫీని ఏడుకొండలు కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అనంతరం ఏడుకొండలు కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దుకాణం పెట్టుకునేందుకు కుటుంబానికి బీసీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రుణం ఇవ్వాలని ఆదేశించారు.
అంతకుముందు యల్లమందలోని కోదండ రామాలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత యల్లమందలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని చాకలి నాగరాజు కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. నాగరాజు కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాగరాజు కుటుంబానికి గొర్రెల షెడ్డును నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఖాళీగా ఉంటున్నామని, ఉద్యోగాలు కల్పించాలని కరుణ అనే మహిళ సీఎం చంద్రబాబుని కోరారు. ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
చేతిలో రూ.600 పెట్టు - పింఛన్ పట్టు - లేకుంటే కట్ - మహిళా అధికారి దౌర్జన్యం