పత్తి చేలల్లో 'పులి' రాకతో పారిపోతున్న వానరాలు - ఫలించిన రైతుల ఆలోచన
🎬 Watch Now: Feature Video
Monkeys are Destroying Crops in NTR District : రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన పంట చివరికి చేతికి వస్తుందో రాదో తెలియని పరిష్ధితి. చివరికి చేతికి వచ్చినా గిట్టుబాటు ధర ఉంటుందో లేదో తెలియని దుస్థితి. ఇలా భూమినే నమ్ముకుని బతుకుతున్న రైతుకు ప్రకృతి, పాలకులు వెన్ను చూపుతున్నా.. చివరికి వానరాలు సైతం మనశ్శాంతిని ఇవ్వడం లేదు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం సింగవరం గ్రామానికి చెందిన పలువురు రైతులు కోతుల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. రెండు నెలలుగా వర్షాలు లేక పోవడంతో పత్తి పంట దిగుబడులు దారుణంగా పడిపోయాయి. ఈ తరుణంలో అరకొరగా కాసిన పత్తికాయలను కోతుల గుంపులు దాడి చేస్తూ పంటను నాశనం చేస్తున్నాయి. ఫలితంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈ సమస్యను అధిగమించేందుకు కొందరు రైతులు పొలాల వద్ద కాపలా కాస్తున్నారు. గుంపులు గుంపులుగా వస్తున్న వానరాలు ఒకోసారి రైతుల పైనే దాడులకు పాల్పడుతున్నాయి. వాటి బెడదను ఎలాగైనా తప్పించాలనుకున్న రైతులు వినూత్నమైన ఆలోచన చేశారు. పులిని చూస్తే కోతులు భయంతో పరుగులు తీస్తుంటాయి. రైతులు పులిబొమ్మను తీసుకు వచ్చి పొలంలో ఉంచితే అటువైపు కోతులు రావడం లేదు. దీనిని గమనించిన అన్నదాతలు పులిబొమ్మను పొలం నలుమూలలకు తిప్పేందుకు గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు. అతనికి నెలకు రూ.15000 వేతనం ఇస్తున్నారు. అతను పులిబొమ్మను సంకలో పెట్టుకొని పొలం గట్లపై అటు ఇటు తిరగటంతో అది చూసిన కోతులు పరారైపోతున్నాయి.