thumbnail

COUNCIL MEETING:'లాగి.. పడేయండి!'.. వైసీపీ కార్పొరేటర్​పై మేయర్ ఆగ్రహం! డిప్యూటీ కమిషనర్​కూ.. అవమానం

By

Published : Jun 4, 2023, 11:56 AM IST

COUNCIL MEETING: కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల్లో వివక్షను ప్రశ్నించిన అధికార పార్టీ కార్పొరేటర్‌ క్రాంతికుమార్‌పై కర్నూలు మేయర్ బీ.వై. రామయ్య తీవ్రంగా మండిపడ్డారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిధులు ఇవ్వకపోవడాన్ని క్రాంతికుమార్ ప్రశ్నించగా.. ఇష్టానుసారం మాట్లాడితే సస్పెండ్ చేస్తానని మేయర్ సదరు కార్పొరేటర్​ను హెచ్చరించాడు. అతడిని లాగి పడేయండి.., ఈడ్చేయండి.. అంటూ పోలీసులను ఆదేశించారు. మేయర్‌ డివిజన్‌లో రూ.7కోట్ల నిధులతో పనులు జరిగితే.. తన డివిజన్‌కు అరకొర నిధులు మాత్రమే కేటాయించారని క్రాంతికుమార్ మండిపడ్డారు. తన డివిజన్ అభివృద్ది కోసం నిధుల అడగడం తప్పా అంటూ ప్రశ్నించారు. సహచర కార్పొరేటర్లు జోక్యంతో వివాదం సద్దుమణిగింది. కాగా మేయర్ వ్యాఖ్యలపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.

కన్నీటి పర్యంతమైన డిప్యూటీ కమిషనర్‌.. విలపిస్తూ సమావేశం నుంచి బయటకు..
మరోవైపు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ రమాదేవి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్‌ విక్రమసింహారెడ్డి ఓ లేఖను చదువుతూ ఆరోపించారు. ఈ క్రమంలో ఆమెను ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలంటూ మేయర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ కమిషనర్‌ రమాదేవి సమాధానమిస్తూ.. తాను విధుల్లో ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారో చెప్పాలని అన్నారు. విక్రమసింహారెడ్డి ఉదయం 5 గంటలకు ఫోన్‌ చేసినా స్పందించినట్లు ఆమె చెప్పారు. తనపై కక్షపూరితంగానే కావాలనే అదనపు కమిషనర్‌ రామలింగేశ్వర్‌ ఆరోపణలు చేయిస్తూ.. వెనుక ఉండి నడిపిస్తున్నారంటూ.. ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తనను పురుషుల మధ్యలో కూర్చోవాలని అంటుంటారని, వ్యక్తిగతంగా కూడా ఆమె దూషిస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆమె వాపోయారు.  అనంతరం ఆమె మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వాలని అడగ్గా మేయర్‌, కమిషనర్‌ ఇవ్వలేదు. దీంతో డిప్యూటీ కమిషనర్ రమాదేవి విలపిస్తూ.. సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.