Union Minister Kishore Kaushal : ప్రధాని ప్రసంగిస్తుండగానే.. వేదికపై కునుకు తీసిన కేంద్ర మంత్రి - విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయం
🎬 Watch Now: Feature Video
Union Minister Kishore Kaushal : దేశ వ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం లక్ష్యమని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కిషోర్ కౌషల్ అన్నారు. 5 వ రోజ్ గార్ మేళా కింద ఎంపికై ఉద్యోగాలు సాధించిన యువతకు ఆయన నియామక పత్రాలు జారీ చేశారు. విజయవాడలోని రైల్వే డివిజనల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించగా.. ఆయా రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు పాల్గొని ధ్రువీకరణ పత్రాలు అందించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 20 లక్షల గృహాలను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం గృహ నిర్మాణానికి ఒక్కొక్కరికి 1.5 లక్షలు ఇస్తుందన్నారు.
కునుకు తీసిన కేంద్ర మంత్రి.. విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయ సమీపంలోని ఆడిటోరియంలో మంగళవారం జరిగిన రోజ్ గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ కునుకుపాట్లు తీస్తూ కనిపించారు. దిల్లీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభం నుంచి మంత్రి వేదికపై కునికిపాట్లు తీస్తూ కనిపించారు. ప్రధానమంత్రి వచ్చి.. కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగి నంతసేపూ కౌశల్ కిశోర్ నిద్రిస్తూనే ఉన్నారు. అధికారులు మధ్యమధ్యలో మంత్రిని మేల్కొల్పుతూ కనిపించారు.