Janasena Leader Gade Venkateswara Rao on Education: 'నాడు-నేడుకు వేల కోట్లు.. ఇంకా అధ్వానంగానే చాలా పాఠశాలలు'
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 8:05 PM IST
Janasena Leader Gade Venkateswara Rao: అక్రమ సంపాదన కోసం విద్యా వ్యవస్థను వాడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని గుంటూరు జిల్లా జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. గుంటూరులోని జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులకు విద్యావ్యవస్థపై చర్చించే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు. విద్యాదీవెన పథకం కింద రూ. 20వేల ఫీజు నాలుగు విడతల్లో చెల్లిస్తున్నారని.. ఇది విద్యార్థులను ఉద్దరించటమా అని ప్రశ్నించారు.
నాలుగేళ్లుగా నాడు నేడు నత్తనడకన సాగుతోందని, వేల కోట్లు ఖర్చు చేసినా.. చాలా పాఠశాలలు అధ్వానంగానే ఉన్నాయని విమర్శించారు. వైసీపీ వచ్చాక విదేశీ విద్యాదీవెన ఆపేయటం ద్వారా విద్యార్థులు ఇబ్బంది పడ్డారని వెంకటేశ్వరరావు ఆరోపించారు. పాఠశాలల విలీనం పేరుతో పిల్లల్ని బడి మాన్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని మండిపడ్డారు. జగన్ చెప్పేవన్నీ అబద్దాలు, చేసేవి మోసాలేనని ఎద్దేవా చేశారు. బైజూస్ డిజిటల్ కంటెంట్ పేరుతో ఊదరగొట్టిన ముఖ్యమంత్రి... ఇప్పుడు ఎడెక్స్ పేరుతో మళ్లీ కొత్తదాన్ని తెచ్చారని.. ఇదంతా కమిషన్ల కోసమేనని వెంకటేశ్వరరావు ఆరోపించారు. విద్యాదీవెన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారని.. అందులో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదని విమర్శించారు. సీఎం సభ అంటే ఆ ప్రాంతంలో రెండురోజుల పాటు ప్రజలకు ఆర్టీసి బస్సులు ఉండవని, గతంలో 6 కిలోమీటర్లకు హెలికాఫ్టర్లో వెళ్లారని, ఇప్పుడు 2 కిలోమీటర్లకు రెండు హెలిప్యాడ్లు నిర్మించారని గాదె వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు.