GVMC: పాత కమిషనర్ అక్రమాలకు పాల్పడ్డారు.. కొత్త కమిషనర్‌కు ఫిర్యాదు
విశాఖలోని జీవీఎంసీ స్పందనలో పూర్వ కమిషనర్ రాజబాబుపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. స్పందనలో ఉన్న ప్రస్తుత కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మకు నేరుగా ఫిర్యాదు పత్రాలను అందజేశారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జీవీఎంసీ పాత కమిషనర్ రాజబాబు నిర్ణయాలను పునః సమీక్షించమని మూర్తి యాదవ్ కోరారు. రాజబాబు హయాంలో జరిగిన, పెట్టుబడుల సదస్సు, జి20 సదస్సు పనులకు సంబంధించిన బిల్లులను తక్షణమే నిలిపివేయాలని కోరారు. అలాగే, రాజబాబు హయాంలో జారీ చేసిన టీడీఆర్‌లలో భారీ అవకతవకలు ఉన్నాయని మూర్తి యాదవ్ ఆరోపించారు. వివిధ వర్గాలనుంచి ఇదే అంశంపై ఫిర్యాదులు ఉన్నందున వాటిని రద్దు చేయాలని పేర్కొన్నారు. రాజబాబు హయాంలో ఇచ్చిన భవన నిర్మాణ ప్లాన్లు, అనుమతులను పునసమీక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. రాజబాబు హయాంలో కాంట్రాక్టర్లకు మంజూరు చేసిన బిల్లులు తీసుకున్న కమిషన్లపై విచారణకు ఆదేశించాలని పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.