Illegal Sand Mining agitation against: ఇసుక రీచ్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజాసంఘం నేతలు నిరసన
🎬 Watch Now: Feature Video
Illegal Sand Mining agitation against: నెల్లూరు జిల్లా ఇసుక రిచ్లో.. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆయా గ్రామాల ప్రజలు, వివిధ కుల సంఘాల నేతలు ఆదోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ఇసుక రీచ్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఇసుక తరలిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణాపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. అధికారులెవ్వరూ పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇసుక రీచ్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతలా అక్రమ రవాణా జరుగుతున్నా... ఇప్పటివరకూ ఏ రాజకీయ నాయకుడు స్పందించ లేదని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా రోడ్లు సైతం పాడవుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఆయా గ్రామాల్లో రూ.50 చెల్లించి ఇసుకను తోడుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఇసుకను బంగారంలా మార్చారని ఎద్దేవా చేశారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా భూ గర్భ జలాలు అడుగంటి పోయే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా ఇసుక తరలింపు కారణంగా వరదలొస్తే నది తీర ప్రాంతం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందన్నారు. అధికారుల స్పందించి ఇసుక అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.