సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని టీడీపీ సానుభూతిపరుడిపై అక్రమ కేసు
🎬 Watch Now: Feature Video
Illegal Case Against TDP Sympathizer in Palnadu District: పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెంలో.. తెలుగు యువత నాయకుడు గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని.. రొంపిచర్ల పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద బాబు, పలువురు టీడీపీ నాయకులు రొంపిచర్ల పోలీసు స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో చర్చించారు. అయితే శ్రీనివాసరెడ్డిని నరసరావుపేట గ్రామీణ సీఐ పి.కృష్ణయ్య వద్దకు తీసుకువచ్చి ఆయనకు చూపించి కేవలం 41ఏ నోటీసు ఇచ్చి పంపిస్తామని రొంపిచర్ల ఎస్సై రవీంద్ర చెప్పారన్నారు. కానీ సాయంత్రం వరకూ శ్రీనివాసరెడ్డిని పోలీసుల వద్దే ఉంచుకుని అక్రమ మద్యం కేసు బనాయించి రిమాండ్‌కు పంపించడం దారుణమని అరవింద బాబు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావులు మండిపడ్డారు.
ఈ దారుణం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని వ్యాఖ్యానించారు. లీలా మీడియా పేరుతో గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారని, టీడీపీకు సానుభూతిపరుడిగా ఉంటున్నాడనే కక్షతోనే అతనిపై లేనిపోని నేరాలు మోపి జైలుకు పంపారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు.. అధికార నేతల మాటలు విని విధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తక్షణం పోలీసులు వైఖరి మార్చుకుని సక్రమంగా విధులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.