rains in ap: రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు.. పాడేరులో వడగళ్ల వాన - ఏపీ నేటి వార్తలు
🎬 Watch Now: Feature Video
rains in andhra pradesh: వేసవి వేడి, ఉక్కపోత, భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు అక్కడక్కడా కురుస్తున్న వర్షాలు, చల్ల గాలులు.. కాస్త ఉపశమనమిచ్చాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా చల్లని గాలులతో పాటు.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కాస్తా పెద్దదిగా మారడంతో... పట్టణంలోని ప్రధాన వీధుల్లోనూ, రహదారులపై భారీగా నీరు చేరి... ప్రజలు అవస్థలు పడ్డారు. శ్రీకన్య కూడలి, శారదానగర్ వంటి ప్రాంతాల్లో... మురుగునీరు పొంగి ప్రవహించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల, పాడేరు మండలాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్ద పరిమాణంలో ఉన్న వడగళ్లు పడ్డాయి. గాలులతో కూడిన వర్షాల కారణంగా... మాడుగులలో ఓ శుభకార్యంలో టెంట్లు నేలకొరిగాయి. టెంట్ల కింద ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. వాహనాల పైభాగాన పడిన వడగళ్లు పెద్ద శబ్ధాలతో భయం కలిగించాయి. పార్వతీపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకూ తీవ్ర ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు.. ఒక్కసారిగా వచ్చిన మబ్బులు కాస్త ఊరటనిచ్చాయి. తర్వాత కాసేపటికే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు 40 నిమిషాలపాటు భారీ వర్షం కురవడంతో.. వాతావరణం కాస్త చల్లబడింది. రోడ్లపై ఉన్న చిన్న వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.