జగన్ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలగాలి.. : కడప దర్గాలో చిన్న రాజప్ప ప్రార్థన - ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలంటూ ప్రార్థనలు
🎬 Watch Now: Feature Video
Chinna Rajappa in Kadapa Dargah: జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాలని అల్లాను ప్రార్థించానని మాజీ హోం శాఖ మంత్రి చిన్న రాజప్ప తెలిపారు. ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గాను చిన్న రాజప్ప సందర్శించారు. దర్గా నిర్వాహకులు ఆయనకు ముస్లిం సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. తలపై పూల చాదర్ పెట్టుకుని సమర్పించారు. దర్గా విశిష్టత గురించి అడిగి తెలుసుకున్న ఆయన.. పెద్ద దర్గా మహిమగలదని గతంలో పలుమార్లు సందర్శించానని పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు ఏ ఒక్కరికీ సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. దీంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం దోచుకో దాచుకో.. అనే నినాదంతోనే ముందుకు వెళుతుందని విమర్శించారు. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ఎర్రచందనం... ఇలా చెప్పుకుంటూ పోతే మాఫియాలతో రాష్ట్ర అట్టుడికి పోతుందని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్న చిన్న రాజప్ప.. .. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. ఇక సాధారణ ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో వైసీపీను ఓడించేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. దీంతోపాటు రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి కోల్పోయారని విమర్శించారు.