ధాన్యాన్ని రోడ్డుపై వేసి ఆందోళనకు దిగిన కృష్ణా జిల్లా రైతులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2023, 1:46 PM IST
Farmers Protest on Road With Harvested Grain: తెలుగు రాష్ట్రాలకు తుఫాను హెచ్చరిక జారీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పామర్రు-అవనిగడ్డ రహదారిపై కోసిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి రైతులు నిరసనకు దిగారు.
Farmers Protest on Palmeru-Avanigadda Road: కృష్ణా జిల్లా మొవ్వ మండలం అయ్యంకిలో రైతులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. వారం రోజుల నుంచి కోసి ఆరబోసుకున్న ధాన్యాన్ని ఆర్బికేల(RBK) ద్వారా కొనుగోలు చేయకుండా అధికారులు సాకులు చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించిన పంటను రోడ్డుపై పోసి నిరసన చేపట్టారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను అడిగితే ఆన్లైన్ ద్వారా కాకుండా ఆఫ్లైన్లో కొనుగోలు చేస్తుందని, సంచులు లేవని, ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని సాకులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక పక్కన వాతావరణం అనుకూలంగా లేక రైతులు ఆందోళన చెందుతుంటే ప్రభుత్వ అధికారులు నిమ్మకు నేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహిస్తున్నారు. వారం రోజుల నుంచి శ్రమించి, వేరే పనులకు వెళ్లకుండా ధాన్యాన్ని ఆరబోసామని అధికారులు కొన్ని ధాన్యం లారీలను వెనక్కి పంపుతున్నారని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైతుల నిరసనతో భారీగా వాహనాలు ఆగడంతో ప్రజలు కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. పోలీసులు రైతులు సర్ది చెప్పడంతో నిరసన విరమించుకున్నారు.