Drinking Water Problems అనంతపురం ఉరవకొండలో మూడు నెలలుగా నిలిచిన కుళాయిలు.. తాగునీటి కోసం అల్లాడుతున్న ప్రజలు
🎬 Watch Now: Feature Video
Drinking Water Problems: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీలో తాగునీటి ఎద్దడి నెలకొంది. మూడు నెలలుగా కుళాయిలకు తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని కాలనీ వాసులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితంలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 800 కుటుంబాలు ఈ కాలనీలో నివాసం ఉంటున్నారు. కుళాయిలకు తాగునీరు సరఫరా చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. తాగునీటిని కొనాల్సి వస్తోందన్నారు. అధికారుల తీరుకు నిరసనగా నిన్న అనంతపురం - బళ్లారి జాతీయ రహదారిపై బైఠాయించారు. వాహనాలను నిలిపేసి రాస్తారోకో నిర్వహించారు. అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. తాము ఇంకెన్నాళ్లు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు. పోలీసులు మహిళలకు సర్ది చెప్పటంతో ఆందోళనను విరమించారు. సోమవారంలోపు తాగునీటి సమస్య పరిష్కరించకుంటే మరోమారు ఆందోళనకు దిగుతామని మహిళలు హెచ్చరిస్తున్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ శివరామిరెడ్డి కాలనీలో గత మూడు నెలలుగా తాగునీరు సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.