కాకినాడ జిల్లా పెదపూడి కాలువలో డాల్ఫిన్ హల్చల్ కానీ - Doctors of Animal Husbandry Department
🎬 Watch Now: Feature Video
Dolphin in Pedapudi canal: సముద్రాలు, నదులలో నివసించే డాల్ఫిన్లు ప్రపంచంలోని అత్యంత తెలివైన జీవులలో ఒకటిగా పరిగణించబడతాయి. మనుషుల కంటే 10 రెట్లు మెరుగ్గా వినగలగడమే వాటికున్న అతి పెద్ద లక్షణం. అందువల్ల ప్రజలు డాల్ఫిన్లను చూడటానికి ముచ్చపడుతుంటారు.. సముద్రంలో ఉండే అవి.. ఒక్కసారిగా ఒక చిన్న పిల్ల కాలువలో ప్రత్యక్షమైతే.. ఇంక అంతే సంగతులు.. వాటిని చూసేందుకు జనం ఎగబడుతుంటారు. అదేవిధంగా ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కానీ.. పిల్ల కాలువలో ఓ డాల్ఫిన్ ప్రత్యక్షమైంది.. ఇంతకీ అది ఎక్కడా అనుకుంటున్నారా ఎక్కడో కాదు మన కాకినాడలోనే..
జిల్లాలోని పెదపూడి కాలువలో గురువారం మధ్యాహ్నం డాల్ఫిన్ కనిపించడంతో స్థానికులు దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. సముద్రం నుంచి ఉప్పుటేరు ద్వారా పెదపూడి కాలువకు డాల్ఫిన్ చేరుకుంది. అయితే పెదపూడి వద్ద నీరు తక్కువగా ఉండటంతో డాల్ఫిన్ పైకి తేలుతూ అందరికీ కనిపించింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని దానిని చూసేందుకు ఒక్కసారిగా గుమిగూడారు. వారు అధికారులకు సమాచారం ఇవ్వగా.. రెవెన్యూ శాఖ, అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు.. దాన్ని పరీక్షించిన అటవీశాఖ అధికారులు.. సముద్ర జలాల్లో సంచరించే జాతుల్లో షార్క్, డాల్ఫిన్ వంటి రకాలు.. వైల్డ్ యానిమల్ పరిధిలోకి వస్తాయని తెలిపారు.
డాల్ఫిన్‌ను స్థానికుల సహాయంతో ఆటోలో జాగ్రత్తగా తీసుకుని.. అచ్యుతాపురత్రయం వంతెన వద్ద ఉన్న ఏలూరు కాలువలో వదిలారు. అప్పటికే.. డాల్ఫిన్ మృతి చెందింది. దీంతో వెంటనే బయటకు తీయించి ఐస్‌లో పెట్టి భద్రపరిచారు అనంతరం శుక్రవారం ఉదయం అటవీ శాఖ, రెవెన్యూ, మత్స్య శాఖ ఆధ్వర్యంలో గ్రామస్థుల సమక్షంలో పశుసంవర్ధక శాఖ వైద్యులు వన్యప్రాణి ప్రోటోకాల్ ప్రకారం డాల్ఫిన్ కొలతలు తీసుకొని పోస్టుమార్టం చేశారు. అనంతరం డాల్ఫిన్ కళేబరాన్ని ఖననం చేశారు.
ఇవీ చదవండి: