ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి నిరసన సెగ.. మీరేం చేశారని ప్రశ్నల వర్షం - నేటి ముఖ్యంశాలు
🎬 Watch Now: Feature Video
Deputy Chief Minister Narayana Swamy : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి జీడి నెల్లూరు నియోజకవర్గంలో నిర్వహించగా.. ఆయనకు అడుగడుగునా నిరసన సెగలే తగిలాయి. ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని ఒకరు, మురుగునీటి సమస్య ఉందని మరొకరు, బస్టాండ్ లేదని ఇలా సమస్యలపై నిలదీశారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం పంచాయతీ పరిధిలో ఆయన పర్యటించగా.. విజయమాంబపురానికి చెందిన యువకులు ఉపముఖ్యమంత్రితో సమస్యలపై వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు గడుస్తున్నా.. యువత ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారని ఉపముఖ్యమంత్రిగా మీరేం చేశారని నిలదీశారు.
డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించలేదన్నారు. మంత్రిగా పని చేస్తున్నా తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరించలేదని మహిళలు విమర్శించారు. గ్రామానికి రాకపోకలు సాగించాలంటే సరైన బస్టాప్ సౌకర్యం లేదని వాపోయారు. గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదని, సరైన రోడ్ల వసతి, మురుగునీటి కాలువల సదుపాయాలు లేవని నిలదీశారు. ఇవేకాకుండా .. సెల్ టవర్ లేదని స్థానికులు ప్రశ్నించగా.. సెల్ టవర్ ఏర్పాటు ఎంపీ పరిధిలోకి వస్తుందన్నారు. దీనిపై ఎంపీని అడగాలని.. అక్కడి నుంచి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేగా మీకు బాధ్యత లేదా అంటూ స్థానికులు నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఉద్యోగాల కల్పన, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటనలను నమ్మి.. ఎన్నో ప్రయాసలను ఎదుర్కొని వైసీపీకి పని చేశామని.. అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగాలు రాలేదని ఉద్యోగార్థులు అడగగా.. వైసీపీ ప్రభుత్వంలో మెరిట్ ఉన్న అభ్యర్థులకే ఉద్యోగాలు వస్తాయని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి బదులిచ్చారు.
TAGGED:
gd nellore