సరోగసితో పుంగనూరు కోడె దూడకు జన్మనిచ్చిన ఆవు - పిండ మార్పిడి విధానంపై ప్రత్యేక అవగాహన
🎬 Watch Now: Feature Video
Cow Gave Birth To Punganur Heifer In Surrogacy: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట ప్రభుత్వ పశు వైద్యశాలలో అద్దెగర్భం(సరోగసి)తో ఓ ఆవు పుంగనూరు జాతి కోడె దూడకు జన్మనిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో చింతల దీవి పశుక్షేత్రంలో తయారుచేసిన ఏడు రోజుల ఘనీకృత పుంగనూరు జాతి పిండాన్ని శెట్టి గుంటలో హరి అనే రైతుకు చెందిన నాటు ఆవు గర్భంలో వెటర్నరీ డాక్టర్ ప్రతాప్ ప్రవేశపెట్టారు. దీంతో ఆ ఆవు పుంగనూరు మేలు జాతి కోడి దూడకు జన్మించింది. ఈ విధంగా జన్మించడం దేశంలోనే మెుట్టమెుదటిదని ప్రతాప్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా అత్యుత్తమ జాతి లక్షణాలు కలిగిన పశువులు, అంతరించిపోతున్న స్వదేశీ జాతుల వృద్ధి అతి తక్కువ సమయంలోనే దోహదపడుతుందని పేర్కొన్నారు. దూడ చాలా ఆరోగ్యంగా ఉందని డాక్టర్ ప్రతాప్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న డాక్టర్లకి పిండ మార్పిడి విధానంపై ప్రత్యేక అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయ పథంలో తీసుకెళుతున్న సీఈవో డాక్టర్ శ్రీనివాసరావు తదితరులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ జాతి ఆవుల పాలు క్యాన్సర్, గుండె జబ్బులకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. పకృతి సేద్యంలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. పిండ మార్పిడి విధానం ద్వారా మనకు కావలసిన పశువులని తక్కువ ఖర్చుతో పొందవచ్చు ప్రతాప్ తెలిపారు.