449 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలి - కాంగ్రెస్ రైతు గర్జన సభలో నేతలు - Congress Rythu Garjan Sabha news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 9:26 PM IST
Congress Rythu Garjan Sabha Updates: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు.. తులసి రెడ్డి, రఘువీరారెడ్డి, పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 జిల్లాల్లోని 449 మండలాల్లో తీవ్రమైన కరవు ఉంటే, కేవలం 7 జిల్లాల్లోని 103 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. మొత్తం 449 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ.. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Congress Party Leaders Comments: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలులో రైతు గర్జన సభ నిర్వహించారు. సభకు ముందు రాజ్ విహార్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ''రాష్ట్రంలో తీవ్రమైన కరవు ఉంది. 18 జిల్లాల్లోని 449 మండలాల్లో కరవు తాండవం చేస్తుంటే.. జగన్ ప్రభుత్వం మాత్రం 7 జిల్లాల్లోని 103 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. ఇది కరెక్ట్ కాదు. మొత్తం 449 మండలాలను కరవు ప్రాంతాలుగా తక్షణమే ప్రకటించాలి. దాంతో పాటు అన్ని మండలాల్లో సహాయక చర్యలు ప్రారంభించాలి. అన్నదాతలకు ఉపాధి హామీ పనులు కల్పించి, వలసలను నివారించాలి'' అని వారు డిమాండ్ చేశారు.