Color Stones Mafia: రెచ్చిపోయిన రంగురాళ్ల మాఫియా.. ఫారెస్ట్ అధికారులపై దాడి - పోలీసుల పై దాడి
🎬 Watch Now: Feature Video
Attack on the forest authorities: పల్నాడు జిల్లాలో రంగురాళ్ల మాఫియా రెచ్చిపోయింది. అటవీ సంపదను దోచుకోవడమే కాకుండా.. అడ్డువచ్చిన అటవీ అధికారులపై దాడులకు సైతం పాల్పడింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ అటవీ అధికారిని ఆటోతో గుద్దే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా పరిసర గ్రామాల ప్రజలను పోగేసి అటవీ అధికారులపైకి దాడి చేయడానికి ఉసిగొలిపే ప్రయత్నం చేయడంతో అటవీ అధికారులు.. పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలంటూ పోలీస్ స్టేషన్ తలుపులను తట్టారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామంలో రంగురాళ్ల అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు పారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రాత్రి సమయంలో అటవీలో అక్రమంగా తవ్వకాలు చేపట్టే వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించిన పారెస్ట్ అధికారులపై రంగురాళ్ల ముఠా సభ్యులు దాడికి తెగబడ్డారు. ఆటో ఎక్కించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పారెస్ట్ అధికారులు వెల్లడించారు. దాడికి దిగినవారిలో కొందరు అధికారి పార్టీ నేతలు ఉన్నారని తెలిపారు. గస్తీలో భాగంగా తమకు సహాయం అందించడానికి పోలీసు సహాయాన్ని కోరినట్లు తెలిపారు. పోలీసులు సైతం తమ విన్నపానికి సానుకులంగా స్పందించినట్లు అటవీ శాఖ అధికారి పేర్కొన్నారు. స్పందించిన పోలీసులు దాడికి తెగబడిన వారిని గుర్తించి వారిపై చర్యలు చేపడతామని పేర్కొన్నారు.