People Left from CM Meeting: సీఎం జగన్ బహిరంగ సభ.. కుర్చీలు లేక జనాల అవస్థలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 26, 2023, 9:02 PM IST

CM Jagan Mohan Reddy Tulluru public meeting Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఏ జిల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేసినా సభకు విచ్చేసిన ప్రజలు.. సభ ప్రాంతంలో సరైన వసతుల్లేక, కుర్చోవడానికి కుర్చీల్లేక, త్రాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక నానా అవస్థలు పడి అక్కడి (సభ) నుంచి తండోపతండాలుగా వెళ్లిపోతున్నారు. దీంతో నాయకులు, అధికారులు వారిని వెళ్లిపోకుండా అడ్డుకుంటున్నారు. అయినా, అధికారుల మాటలు పట్టించుకోని ప్రజలు.. వివిధ దారుల వెంట తిరుగు వెళ్లిపోతున్నారు. నేటి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ అదే పరిస్థితి నెలకొంది.

కూర్చోవడానికి కుర్చీలు లేవు.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్ రాజధాని అమరావతి పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి లారీల్లో, బస్సుల్లో విచ్చేసిన ప్రజలు.. సభ ఏర్పాట్లను చూసి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలరీల్లో కూర్చోవడానికి కుర్చీలు సరిగా లేకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. చేసేదేమి లేక.. వారే స్వయంగా వెళ్లి లారీల్లో ఉన్న కుర్చీలు తీసుకెళ్లి కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. సభ కోసం ఏర్పాటు చేసిన ప్రాంగణం సరిపోకపోవడంతో కొంతమంది మహిళలు ఎండలోనే నిలబడిపోయారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తుండగానే మధ్యలోనే చాలా మంది నిరుత్సాహంతో సభ నుంచి వెనుదిరిగారు.  

సభకు రాకపోతే జాబితా నుంచి పేర్లు తొలగిస్తామన్నారు.. మరోవైపు వెంకటాయ­పాలెంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విచ్చేసిన.. మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండలో నిలబడలేక, కూర్చోవడానికి కుర్చీలు లేక సభకి దూరంగా ఉన్న చెట్ల కింద సేద తీరారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తాము ముఖ్యమంత్రి సభకు రాకపోతే ఇంటి పట్టాల జాబితా నుంచి తమ పేర్లు తొలగిస్తామని వార్డు వాలంటీర్లు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు చెప్పారని ప్రజలు వాపోయారు. ఎండను సైతం లెక్కచేయకుండా తాము ఉదయం ఆరు గంటలకు బయలుదేరి సభకి వస్తే.. కనీసం కుర్చీలు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇళ్ల పట్టాలు ఈ సభలోనే ఇస్తారని చెప్పి.. వార్డు, సచివాలయ సిబ్బంది తీసుకొచ్చారని, చివరికి తమకి ఎటువంటి పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల గురించి సిబ్బందిని నిలదీయగా.. తమ ప్రాంతంలో మరికొన్ని రోజుల తర్వాత పట్టాలు ఇస్తామని చెబుతున్నారని ప్రజలు వాపోయారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.