Cell Phones Recovery App: నెల్లూరు జిల్లాలో భారీగా సెల్ఫోన్ల రికవరీ.. రూ.1.6కోట్ల విలువైన మొబైల్స్ అందజేత..
🎬 Watch Now: Feature Video
Cell Phones Recovery with Mobile Hunt: నెల్లూరు జిల్లా పోలీసులు మొబైల్ హంట్ సేవలను చక్కగా వినియోగించుకుంటున్నారు. దీనిపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇప్పటి వరకు మూడు విడతలలో 664సెల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు హంట్‌లో నమోదయింది. మొబైల్ హంట్ ద్వారా గుర్తించిన రూ.65 లక్షల విలువైన 270 సెల్ఫోన్లను బాధితులకు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి సోమవారం సాయంత్రం అందించారు. ఇలా ఇప్పటి వరకు 1.6కోట్ల రూపాయలు విలువైన సెల్ఫోన్లను మొబైల్ హంట్ యాప్ ద్వారా సేకరించి బాధితులకు అందజేశారు. పోలీసు వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తూ పోగొట్టుకున్న సెల్ఫోన్లను తిరిగి అందించడమే మొబైల్ హంట్ ప్రధాన ధ్యేయమని ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వరరెడ్డి అన్నారు. మెసేజ్ పంపితే చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి అందిస్తామన్నారు. గోపాల్ అనే బాధితుడు పోగొట్టుకున్న ఐఫోన్‌ను ఎస్పీ అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ హిమవతి, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.