Bopparaju condemned attack on RTC drivers : ఆర్టీసీ డ్రైవర్లపై దాడి... ప్రభుత్వానికి ఏపీజేఏసీ హెచ్చరిక.. కడుపు మండుతోందని వ్యాఖ్య - బొప్పరాజు వెంకటేశ్వర్లు పర్యటన వివరాలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2023, 5:05 PM IST
Bopparaju condemned attack on RTC drivers : సభ్య సమాజం తలించుకునే విధంగా కావలిలో ఆర్టీసీ డ్రైవర్లపై రౌడీ మూకలు దాడి చేయడం దారుణమని, ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. విజయనగరంలో ఏపీ జేఏసీ అధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే వరకూ ఏపీ జేఏసీ, ఏపీ పీటీడీ పోరాడుతుందని తెలిపారు. ఈ ఘటనకు కారకులు ఎంతటి వారైనా శిక్షించక పోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దాడి చేసిన విధానాన్ని చూస్తుంటే ప్రతి ఉద్యోగి కడుపు మండిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి ఘటన ఉద్యోగుల హృదయాలు కలచివేసే విధంగా ఉందని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తూ.తూ. మంత్రంగా అరెస్టులు చేసి వదిలేయకుండా... నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ డ్రైవర్లపై దాడులకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు నేడు నల్ల బ్యాడ్జ్‌లతో విధులకు హాజరయ్యారని ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పలి శెట్టి దామోదర రావు వెల్లడించారు. దాడులకు వ్యతిరేకంగా... 129 డిపోల్లో ధర్నాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కొంత మందిని మాత్రమే అరెస్ట్ చేశారని, మిగిలిన వారిని కూడా శిక్షించే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని దామోదర రావు తెలిపారు. నాయకుల ప్రోద్బలంతో పోలీసులు విచారణను జాప్యం చేస్తే... జేఏసీ ఆధ్వర్యాన పోరాటాలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఘటనకు కారకులైన వారు ఎంతటి వారైనా... అరెస్ట్ చేసి శిక్షిస్తామని సజ్జల హామీ ఇచ్చినట్లు తెలిపారు.