Beneficiaries Waiting for Ration Goods: రేషన్ సరుకులు కావాలంటే..కూలి పనులు మానుకోవాల్సిందే: లబ్ధిదారులు - ap latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 12:16 PM IST
Beneficiaries Waiting for Ration Goods in Hindupuram : లబ్ధిదారులకు ఇంటింటికే రేషన్ సరుకుల్ని అందజేస్తున్నామని వైసీపీ నేతలు ఊదరగొడుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సత్యసాయి జిల్లా హిందూపురంలోని ముదిరెడ్డిపల్లెలో రేషన్ సరుకుల వాహనాన్ని ఓ చోట నిలిపివేసి పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గత నాలుగు రోజులుగా నిరీక్షిస్తున్న పంపిణీ కార్యక్రమం సక్రమంగా కొనసాగడం లేదంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక సమయానికి సర్వర్లు పని చేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. కూలీకి వెళ్తే గానీ పూట గడవని పరిస్థితుల్లో.. ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల కోసం రోజులు తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో రేషన్ సరుకుల కోసం కళాశాలకు సెలవు పెట్టాల్సి వస్తోందని ఓ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. మరో వైపు సాంకేతిక సమస్యల కారణంగానే పంపిణీలో ఆలస్యం జరుగుతోందని ఆపరేటర్లు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.