Tulasi Reddy criticizes CM Jagan: సీఎం జగన్ శంకుస్థాపనల స్పెషలిస్ట్.. ఒక్క పనైనా ప్రారంభమైందా..? : తులసిరెడ్డి - congress
🎬 Watch Now: Feature Video
Tulasi Reddy criticizes CM Jagan: "పుల్లన్న పులివెందుల సంతకు పోనూ పొయ్యాడు.. రానూ వచ్చాడు ఒట్టి చేతులతో..." అన్నట్లుంది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటన అని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. కడప జిల్లా వేంపల్లిలో తులసి రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... జగన్ శంకుస్థాపనలకే పరిమితమయ్యాడు. ప్రారంభోత్సవాల్లేవు.. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ శంకుస్థాపనలకు స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు అని విమర్శించారు. జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్ కు రెండు సార్లు శంకుస్థాపన చేసినా అతీగతీ లేదని మండిపడ్డారు. 2019 డిసెంబర్ 22న కుందూ- పెన్నా ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేస్తూ... పనులు ఇంతవరకు ప్రారంభించలేదని తెలిపారు. అదేరోజు రూ.1,357 కోట్లతో శంకుస్థాపన జరిగిన రాజోలి జలాశయం పనుల్లో పురోగతి లేదని అన్నారు. 2019 డిసెంబర్ 25న రూ.312 కోట్లతో జొలద రాశి జలాశయానికి శంకుస్థాపన చేసినా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని తులసిరెడ్డి విమర్శించారు. ఇక కొప్పర్తి పారిశ్రామికవాడలో ప్రచారమే తప్ప పరిశ్రమలు రాలేదని, రూ.55 కోట్లతో దేవుని కడప చెరువు సుందరీకరణ లేదని చెప్పారు. రూ.30 కోట్లతో బగ్గవంక సుందరీకరణ పనులు చేయలేదు... అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు పునరావాసం ఇంతవరకు అందలేదు.. వేంపల్లి - రాయచోటి రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయి ప్రయాణికులు భూలోకంలో యమలోకం చూస్తున్నారని ధ్వజమెత్తారు. కడపలో బ్రౌన్ లైబ్రరీకి రూ.5.50కోట్లు ఇస్తామని చెప్పి 5 పైసలు కూడా విదల్చలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోయి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే లోపు వాటన్నింటికీ ప్రారంభోత్సవాలు చేస్తే మంచిదని తులసి రెడ్డి హితవు పలికారు.