BJP Vishnuvardhan Reddy Fire on Cm: " వైద్య విద్యార్థుల పోరాటంపై సీఎం జగన్ ఎందుకు స్పందించరు..?" - వైద్య విద్యార్థుల పోరాటం
🎬 Watch Now: Feature Video
BJP leader Vishnuvardhan Reddy Fire on Cm Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ అధికారులపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు హక్కుగా సంక్రమించిన 15శాతం కన్వీనర్ కోటా సీట్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశాలు ఇవ్వకుండా చేసిన అన్యాయంపై జగన్ ప్రభుత్వం తక్షణమే న్యాయస్ధానాన్ని ఆశ్రయించాలని డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు విషయంలో తెలంగాణ సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబరు 72 ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉందని విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు.
వైద్య విద్యార్థులకు జగన్ ప్రభుత్వం న్యాయం చేయాలి.. విష్ణువర్ధన్‌రెడ్డి విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ''రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లో ఉన్నత విద్యాసంస్థల్లోని 15శాతం అన్‌రిజర్వుడు సీట్లలో పదేళ్లపాటు ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు కేటాయింపు అంశం ఉంది. కానీ, సీఎం కేసీఆర్ రాజకీయ దురుద్దేశంతో ఏపీ విద్యార్థులకు అన్యాయం చేశారు. సీట్లన్నీ 100శాతం తెలంగాణ విద్యార్థులకే దక్కేలా జీవో తెచ్చారు. ఆ జీవోపై ఈ (ఏపీ) రాష్ట్ర విద్యార్థులు పోరాడుతుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. న్యాయం కోసం విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. విద్యార్థులు కాదు కోర్టుకు వెళ్లాల్సింది... మీరు, మీ ప్రభుత్వం, మీ విద్యాశాఖ అధికారులు వెళ్లాలి.'' అని సీఎం జగన్‌ను ఉద్దేశించి విష్ణువర్దన్ రెడ్డి విమర్శించారు.