Capital Farmers Dharna: సీఆర్డీఏ మొండి వైఖరిని నిరసిస్తూ.. రేపు అమరావతి రైతుల ధర్నా - ap latest news
🎬 Watch Now: Feature Video
Capital Farmers Dharna in vijayawada : రాజధాని రైతులపై సీఆర్డీఏ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 19న బుధవారం ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో భారీ ధర్నా నిర్వహించనున్నారు. కౌలు చెక్కులు ఇవ్వకుండా మళ్లీ భూ పత్రాల పరిశీలన చేయాలన్న సీఆర్డీఏ నిర్ణయం మానుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దాదాపు 8 సంవత్సరాలు కౌలు ఇచ్చిన తర్వాత తాజాగా భూ పత్రాల పరిశీలన పేరుతో కాలయాపన చేయడానికే ఈ కుట్ర చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఇలాంటి కాలయాపన చర్యలు మానుకొని తమకు ఇచ్చిన స్థలాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. భూసమీకరణ సమయంలోనే అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తీసుకున్నారని వారు చెప్పారు.
"ఎప్పుడైతే మా రిటర్నబుల్ ఫ్లాట్లు మాకు రిజిస్ట్రేషన్ చేస్తారో అప్పుడు పరిశీలన జరుగుతుంది. కానీ సీఆర్డీఏ ఎందుకు అర్ధాంతరంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయాలి. ఈ నెపంతో కౌలు జమని వాయిదా వేస్తూ తీవ్ర ఇబ్బందులకు కలగజేస్తున్నారు. సీఆర్డీఏ రైతుల పట్ల ఒక పక్షపాత వైఖరితో, మోసపూరితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది."- పువ్వాడ సుధాకర్, రాజధాని ఐకాస సభ్యుడు