వసతి గృహాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్‌ఎఫ్ మహా ధర్నా
🎬 Watch Now: Feature Video
AISF Dharna in Anantapur : వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ (AISF) విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. సంగమేశ్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు మేనమామలా ఉంటానంటూ సీఎం జగన్ నాలుగున్నరేళ్లుగా చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.
పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ ఛార్జీలు రూ.1.70 కోట్లు విడుదల చేయాలన్నారు. కరవు జిల్లా విద్యార్థులకు అన్ని రకాల ఫీజులు రద్దు చేసి ప్రత్యేక స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.