Tension in Rajini Tour: మైలవరంలో మంత్రి రజినిని అడ్డుకునేందుకు స్థానికుల యత్నం.. ఉద్రిక్తత - ఎన్టీఆర్ జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18745229-705-18745229-1686664366910.jpg)
Tension At Vidadala Rajini Tour : ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మైలవరంలో నూతనంగా నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ప్రారంభించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీ రావుతో కలిసి ఆసుపత్రిలో ఏర్పాట్లను విడదల రజని పరిశీలించారు. అనంతరం మంత్రిని అడ్డుకునేందుకు కాన్వాయ్ వెళ్లే రహదారి వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు. ఎస్సీ సామాజిక భవనానికి అదనపు విస్తీర్ణం పేరిట ఇళ్లను తొలగించడంతో న్యాయం చేయాలంటూ మంత్రికి తమ గోడు చెప్పుకునేందుకు వచ్చిన బాధితులను పోలీసులు అడ్డగించారు. దీంతో పోలీసులు స్థానికులు మధ్య వాగ్వాదాలతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
హోంశాఖ మంత్రి విడదల రజనికి స్వాగతం.. సుస్వాగతం! : ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో వింత పరిణామం చోటు చేసుకుంది. ఫ్లెక్సీల్లో రాజకీయ నాయకులు రజని మంత్రి శాఖనే మార్చేసి.. కొత్త శాఖను అప్పగించారు. వైద్య, ఆరోగ్య శాఖ బదులు హోం శాఖ అని ప్రింట్ చేసిన ఫ్లెక్సీలు కట్టారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మాత్యులు విడదల రజినికి స్వాగతం.. సుస్వాగతం' అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అది చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.