4 Years Wonderkid: మహానాడులో బుడతడు.. గుక్కతిప్పుకోకుండా టీడీపీ పథకాల వివరాలు... - 4 Years Wonder Kid
🎬 Watch Now: Feature Video
Four Years WonderKid in mahanadu: రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు అట్టహాసంగా జరుగుతోంది. ఈ పసుపు పండుగలో ఓ బుడతడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. నేనుసైతం అంటూ... ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలపై గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు నాలుగేళ్ల చిన్నారి అనిత్. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన చిరంజీవి, రేవతి దంపతుల అనిత్.. ముద్దులొలికే మాటలతో ఎన్టీఆర్ తాత జిందాబాద్, చంద్రబాబు తాత జిందాబాద్.. అంటుంటే అక్కడున్న టీడీపీ కార్యకర్తలు ముగ్ధులవుతున్నారు.
తెలుగు జాతికి, తెలుగు గడ్డకి, నా తెలుగు ప్రజలకు వందనం, అభివందనం అంటూ మెుదలు పెట్టిన అనిత్... అనర్గళంగా మాట్లాడున్నాడు. కేవలం నాలుగు ఏళ్లు నిండని బుడతడి నోటి నుంచి వస్తున్న పలుకులపై అక్కడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కరడు గట్టిన టీడీపీ అభిమానులు సైతం చెప్పలేని విధంగా... ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ వివరాలు, తెలుగు దేశం ప్రవేశ పెట్టిన పథకాలు వాటి ద్వారా లబ్ధి పొందిన వర్గాలను గురించి సైతం చెబుతూ ఔరా..! అనిపిస్తున్నాడు. తెలుగు దేశం అధికారంలో వస్తే పేదలకు కలిగే ఉపయోగాలు వెల్లడిస్తూ... చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాడు. మహానాడు కోసం వచ్చిన వారిని ఈ బుడతడి మాటలు విశేషంగా ఆకర్శిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు కూడా ఇలా ఉండాలి అంటూ పలువురు చర్చించుకునేలా అనిత్ ఆకట్టుకుంటున్నాడు.