How to Choose Better ToothPaste for Healthy : పూర్వం పళ్లు తోముకోవడానికి వేప, తంగేడు పుల్లలు వంటివి వినియోగించేవారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా టూత్‌పేస్ట్(ToothPaste) కనిపిస్తుంది. అయితే.. సరైన టూత్ పేస్ట్ ఎంచుకోకపోతే దంతాలు సరిగా శుభ్రం కావని మాత్రమే చాలా మంది భావిస్తారు. కానీ.. సరైన టూత్ పేస్ట్ వాడకపోతే.. భయంకరమైన రోగాలు చుట్టుముట్టే అవకాశం ఉందని మీకు తెలుసా? మీరు రోజూ ఉపయోగించే టూత్‌పేస్ట్‌లో క్యాన్సర్(Cancer)తో పాటు వివిధ అనారోగ్య సమస్యలు కలిగించే రసాయనాలు ఉంటాయని తెలుసా? టూత్‌పేస్ట్ కొనుగోలు చేసేముందే క్యాన్సర్ కారకాలు ఉన్నాయో లేదో చెక్ చేసి తీసుకోకపోతే.. దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే.. టూత్‌పేస్టులు క్యాన్సర్‌కు కారణం అవుతాయని ఇప్పటి వరకూ పూర్తిస్థాయి నివేదిక ఏదీ ధ్రువీకరించలేదు. కానీ.. పేస్టులలో వాడే కొన్ని రసాయనాలు మాత్రం దీర్ఘకాలంలో క్యాన్సర్ కారకాలుగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన మాత్రం వ్యక్తమవుతోంది. ఈ హానికరమైన రసాయనాలు చిగుళ్ల నుంచి రక్తంలో కలిసి నష్టాన్ని కలిగిస్తాయట. అందుకే.. ఈ కారకాలను దృష్టిలో పెట్టుకొని బెటర్ టూత్‌పేస్ట్ సెలెక్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూస్తే...
ట్రైక్లోసన్ : ఇది ఒక యాంటీ మైక్రోబయల్ ఏజెంట్. బ్యాక్టీరియా, ఫంగల్ పెరుగుదల రెండింటికీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. టూత్‌పేస్ట్‌తో మొదలుకొని సబ్బులు, సౌందర్య సాధనాలలో ఇది ఉంటుంది. అయితే.. దీన్ని సాధారణ స్థాయిలో యాడ్ చేయాల్సి ఉంటుంది. కానీ.. కొన్ని పేస్టుల్లో దీని మోతాదు ఎక్కువగా ఉంటోందని సమాచారం. దీన్ని దీర్ఘకాలంగా ఉపయోగించడం వల్ల.. శరీరంలోని చాలా హార్మోన్లకు ఇబ్బంది కలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆడవారిలో ఈస్ట్రోజెన్, థైరాయిడ్ హార్మోన్లను దారుణంగా అణచివేస్తుందట. దీంతో.. శరీర వ్యవస్థలు సరిగ్గా పనిచేయక.. దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. Science Translational Medicine ప్రచురించిన అధ్యయనంలో.. ట్రైక్లోసన్ ద్వారా ఎలుకల్లో క్యాన్సర్ ముప్పు బయటపడినట్టు పేర్కొంది.
పేస్ట్ వేసుకునే ముందు బ్రష్‌ను తడుపుతున్నారా?.. అయితే మీరు తప్పు చేస్తున్నట్లే!
ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు : టూత్‌పేస్ట్‌లో తియ్యని టేస్ట్ రావడానికి సాచరిన్, స్పార్క్ వంటి స్వీట్నర్లు వాడుతారు. అయితే.. మోతాదు మించిన స్వీట్నర్ దీర్ఘకాలం వినియోగిస్తే ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలు ఉన్నాయి. ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ అధికంగా వాడితే క్యాన్సర్ ముప్పు ఉండొచ్చని NutriNet-Santé ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. ఇది ధ్రువీకరణ కావాల్సి ఉంది. అలాగే టూత్ పేస్ట్‌లో తీపి కోసం అస్పర్టేమ్ అనే పదార్థం కూడా వినియోగిస్తారు. ఇది పేగుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని, రక్తంలో చక్కెర స్థాయిలకు అంతరాయం కలిగిస్తుందనే అనుమానాలు ఉన్నాయి.
డైతనోలమైన్ (DEA) : ఇది టూత్‌పేస్ట్‌లో నురగను సృష్టిస్తుంది. అయితే.. ఇది కూడా లివర్, కిడ్నీలపై ఎఫెక్ట్ చూపిస్తుందని.. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. National Toxicology Program (NTP) 1998లో చేసిన ఓ అధ్యయనంలో.. మోతాదు మించిన డైతనోలమైన్ (DEA) జంతువుల్లో క్యాన్సర్‌కు కారణం అవుతుందని తేల్చింది.
పారాబెన్స్ : టూత్‌పేస్ట్‌తో సహా వివిధ సౌందర్య సాధనాల షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి.. పారాబెన్‌లను ఉపయోగిస్తారు. అయితే ఇవి ఈస్ట్రోజెన్‌ను అనుకరించి దాని పనితీరుకు అంతరాయం కలిగిస్తుందని సమాచారం. అధిక మోతాదులో వినియోగిస్తే.. కొన్ని సందర్భాల్లో రొమ్ము క్యాన్సర్‌కూ కారణం కావొచ్చనే సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు టూత్‌పేస్ట్ కొనేటప్పుడు ఈ అంశాల గురించి తెలుసుకొని తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Pimples Removal Tips : మొటిమలు, మచ్చలు ఎలా తగ్గించుకోవాలి? టూత్‌పేస్ట్ రాయొచ్చా?