భూమ్మీద జీవకోటి మొత్తానికి శక్తి కేంద్రం సూర్యుడే. ఆయన కిరణాల నుంచి ప్రసరించే శక్తి లభించకపోతే ప్రాణులకు మనుగడే లేదు. చెట్ల పచ్చదనానికైనా.. జీవుల వెచ్చదనానికైనా సూర్యుడే ఆధారం. కాల గమనానికి, ఆహార చట్రానికి మాత్రమే కాదు.. మన ఆరోగ్య చక్రానికీ ఆయనే మూలం. మన నిద్ర, మెలకువల దగ్గర్నుంచి.. హుషారు, ఉత్సాహం వంటివన్నీ భానుడి వెలుగుతో ముడిపడినవే. రెండు, మూడు రోజులు సూర్యుడు కంటికి కనబడకపోతే నిస్సత్తువ, నిరాశ ఆవహించటం అందరికీ తెలిసిందే. అందుకే జవమూ జీవమూ అయిన సూర్యుడిని అనాదిగా దేవుడిగానూ కొలుస్తూ వస్తున్నాం. సూర్య నమస్కారాలతో అటు ఆధ్యాత్మిక సంపదను ఇటు ఆరోగ్య సిరులను దక్కించుకోవటం ఆరంభించాం. ఒక్క మనదేశంలోనే కాదు.. చాలాదేశాల్లోనూ సూర్యుడిని దేవుడిగా ఆరాధించటం కనబడుతుంది. ప్రాచీన గ్రీస్, అరేబియాలో సూర్యరశ్మిని చికిత్సల కోసమూ ఉపయోగించుకోవటం గమనార్హం. ప్రాచీన ఈజిప్టులో ఎండను సూక్ష్మక్రిములను నాశనం చేయటానికీ వాడుకునేవారు. గ్రీకు చరిత్రకారుడు హిరొడాటస్ 6వ శతాబ్దంలోనే ఎండ ప్రయోజనాలను నమోదు చేశాడు. ఆయన ఒకసారి మధ్యధరా ప్రాంతానికి వెళ్లినపుడు.. యుద్ధంలో మరణించిన సైనికుల పుర్రెల తీరుతెన్నుల్లో తేడాలుండటం విస్మయం కలిగించింది. ఈజిప్టు సైనికుల పుర్రెలు మందంగా, గట్టిగా.. పర్షియా సైనికుల పుర్రెలు పలుచగా, పెళుసుగా ఉండటం ఆయనను ఆలోచింపజేసింది. అప్పట్లో ఈజిప్టువాళ్లు నున్నగా గుండు కొట్టించుకునేవాళ్లు, సూర్యుడిని ఆరాధించేవారు. అదే పర్షియా వాసులు ఎండ నుంచి కాపాడుకోవటానికి నిండుగా తలపాగా చుట్టుకునేవారు. ఎముకల పటుత్వంలో తేడాకు సూర్యరశ్మి ప్రభావమే కారణమని ఆయన ఆనాడే ఊహించాడు. ఇదొక్కటే కాదు. ఆధునిక జీవనశైలి మోసుకొస్తున్న ఎన్నెన్నో జబ్బుల గండాలను దాటటానికి మనకు సూర్యుడే దిక్కని అధ్యయనాలు, అనుభవాలు నొక్కి చెబుతున్నాయి.
ఉత్సాహం ఉరకలు!
ఆకాంక్షలు నెరవేరకపోవటమో, లక్ష్యాలను చేరుకోలేకపోవటమో.. కారణమేదైనా ఇప్పుడు ఎంతోమంది నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. ఉత్సాహం ఉడిగిపోయి జావగారిపోతున్నారు. వీటికి సూర్యరశ్మి మంచి విరుగుడు. మన కంటికి ఎండ వెలుగు తాకినప్పుడు అది రెటీనా ద్వారా మెదడులోకి చేరుకొని సెరటోనిన్ హార్మోన్ విడుదలయ్యేలా చేస్తుంది. దీని మూలంగా రక్తంలో ఎండార్ఫిన్ల స్థాయులు పెరుగుతాయి. దీంతో ఆనందం, సంతోషం వంటి భావనలు పుంజుకుంటాయి. మనసులో ఉల్లాసం నెలకొంటుంది. ఆందోళన, ఉద్రిక్తత తగ్గుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఏకాగ్రత కూడా మెరుగవుతుంది. కాబట్టి ఎప్పుడైనా నిరుత్సాహం ఆవరించినా, నిరాశ చుట్టుముట్టినా అలా ఎండలోకి వెళ్లి 'వెలుగుల' ఉత్సాహాన్ని నింపుకోవటానికి ప్రయత్నించండి.
కమ్మ కమ్మటి నిద్ర!
మొదట్నుంచీ మన జీవితం వెలుగు, చీకట్ల మీదే నడుస్తోంది. పగటిపూట బయటకు వెళ్లటం, పనులు చేసుకోవటం.. చీకటి పడుతుండగా ఇంటికి చేరుకోవటం, పడుకోవటం వంటివి అనాదిగా పరిణామక్రమంలో భాగంగానే అబ్బుతూ వచ్చాయి. చీకటి పడుతున్నకొద్దీ పీయూషగ్రంథి ఉత్తేజితమై మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంటుంది. మనకు కళ్లు మూతలు పడటానికి, నిద్ర ముంచుకురావటానికి మూలం ఇదే. ఉదయం పూట ఒంటికి ఎండ తగిలినవారికి రాత్రిపూట మెలటోనిన్ హార్మోన్ మరింత త్వరగా ఉత్పత్తి అవుతుండటం విశేషం. దీంతో పడుకోగానే వెంటనే నిద్ర పట్టేస్తుందన్నమాట. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు, కాన్పు తర్వాత కుంగుబాటుకు గురయ్యేవారు, చలికాలంలో విచారంతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే ఎండ తగిలేలా చూసుకోవటం మంచిది.
గుండెకు మేలు!
ఎండకు గుండెకు సంబంధమేంటని చాలామంది ఆశ్చర్యపోవచ్చు గానీ గుండె ఆరోగ్యానికీ ఎండ ఎంతగానో మేలు చేస్తుంది. మన చర్మం పొరల్లో నైట్రిక్ ఆక్సైడ్ దండిగా నిల్వ ఉంటుంది. చర్మానికి ఎండ తగిలినపుడు ఇది ఉత్తేజితమై రక్తంలోకి విడుదలవుతుందని స్కాట్లాండ్ అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తనాళాలు విప్పారటానికి నైట్రిక్ ఆక్సైడ్ దోహదం చేస్తుంది కాబట్టి రక్తపోటు కూడా తగ్గుముఖం పడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటే గుండెపోటు, పక్షవాతం వంటి ముప్పులూ తగ్గుతాయి. ప్రస్తుతం గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. సిస్టాలిక్ రక్తపోటు 20 ఎంఎంహెచ్‌జీ తగ్గినా గుండె రక్తనాళాల సమస్యలతో సంభవించే ఇలాంటి మరణాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అంటే ఎండ- గుండెకు భరోసా నిస్తూ.. ఎక్కువకాలం జీవించటానికీ తోడ్పడుతుందన్నమాట.
అతి ప్రధానం విటమిన్ డి
ఎండ ప్రయోజనాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది విటమిన్ డి. ఇది అన్ని విటమిన్ల లాంటిది కాదు. ఆహారం ద్వారా లభించేది కొద్దిగానే. సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాల సాయంతోనే మన చర్మం దీన్ని చాలావరకు తయారు చేసుకుంటుంది. మన శరీరంలోని ప్రతి కణంలో సుమారు 25,000 నుంచి 35,000 జన్యువులుంటాయి. వీటిల్లో దాదాపు 3వేల జన్యువులపై విటమిన్ డి ప్రభావం చూపుతుంది. తిన్న ఆహారంలోని క్యాల్షియాన్ని శరీరం సక్రమంగా గ్రహించుకోవటానికి విటమిన్ డి అత్యావశ్యకం. ఎముకలు ఏర్పడటానికి, బలోపేతం కావటానికి, క్షీణించకుండా ఉండటానికి క్యాల్షియం అత్యవసరమన్నది తెలిసిందే. రోగనిరోధకశక్తి పుంజుకోవటంలోనూ విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుంది. తెల్లరక్తకణాలు చురుకుగా పనిచేసేలా చూస్తూ.. హానికారక క్రిములతో శరీరం సమర్థంగా పోరాడటంలో సాయం చేస్తుంది. రక్తనాళాలను ఆరోగ్యంగానూ ఉంచుతుంది. అంతేకాదు.. క్లోమంలోని బీటా కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ ఉత్పత్తి సజావుగా సాగేలా కూడా చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే- విటమిన్ డి కణ విభజనను నియంత్రించటం. అంటే ఇది క్యాన్సర్లు దరిజేరకుండానూ కాపాడుతుందన్నమాట. తగినంత విటమిన్ డి గలవారికి పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, క్లోమ క్యాన్సర్ వంటి రకరకాల క్యాన్సర్ల ముప్పు 60% తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎంతోమంది నిస్సత్తువ, నీరసం, కండరాల నొప్పుల వంటి వాటితో బాధపడటం చూస్తూనే ఉన్నాం. వీటికీ విటమిన్ డి కళ్లెం వేస్తుంది. అంతేనా? నాడుల పనితీరునూ మెరుగుపరుస్తుంది. ఇలా నడుస్తున్నప్పుడు తూలిపోవటం, పాదాలకు స్పర్శ తగ్గటం వంటి సమస్యలు దరిజేరకుండానూ కాపాడుతుంది. అందుకే దీన్ని ఆధునిక కాలంలో ముంచుకొస్తున్న జీవనశైలి సమస్యలన్నింటికీ సంజీవని అని చెప్పుకోవచ్చు. దీన్ని ఎలాంటి ఖర్చు లేకుండా.. కోరినవారికి కోరినంత అందించేది సూరీడే! అరగంట సేపు చర్మానికి ఎండ తగిలితే 50,000 ఐయూల విటమిన్ డి రక్తంలోకి విడుదలవుతుంది. అదే మనలాంటి ముదురు చర్మం గలవారిలోనైతే 8,000-10,000 ఐయూల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనం ఇంకాస్త ఎక్కువసేపు ఎండలో విహరించాల్సి ఉంటుందన్నమాట.
బరువు అదుపు!
ఇప్పుడు ప్రపంచమంతా అధిక బరువుతోనే సతమతమవుతోంది. ఎవర్ని చూసినా బరువు తగ్గించుకోవాలని చూసేవారే. దీనికి కూడా ఎండ పరిష్కార మార్గం చూపుతోంది. మన చర్మం పైపొర కింద తెల్ల కొవ్వు కణజాలం ఉంటుంది. ఇది కేలరీలను ఖర్చు కానీయకుండా నిల్వ చేసుకోవటానికే ప్రయత్నిస్తుంటుంది. అయితే చర్మానికి ఎండ తగిలినపుడు దానిలోని నీలం కాంతి తరంగాలు లోపలికి చొచ్చుకెళ్లిపోయి ఈ తెల్ల కొవ్వు కణజాలం పరిమాణం తగ్గేలా చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇలా కణాల నుంచి కొవ్వు బయటకు రావటానికీ మార్గం సుగమమవుతోంది. దీంతో కణాలు ఎక్కువ కొవ్వును నిల్వ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా బరువు కూడా అదుపులోకి వస్తుంది.
ఇన్‌ఫెక్షన్లకు కళ్లెం!
బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల వంటివి దరిజేరకుండా చూడటంలోనూ సూర్యరశ్మి తోడ్పడుతుంది. ఎండలోని వేడి సూక్ష్మక్రిములను చంపుతుందనేది తెలిసిందే. అంతేకాదు.. సూర్యరశ్మి సమక్షంలో మన చర్మం తయారుచేసుకునే విటమిన్ డి ఒక రకం పాలీపెప్టైడ్‌ను (క్యాథెలిసిడిన్) మరింత ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది. ఈ క్యాథెలిసిడన్ బ్యాక్టీరియా, వైరస్‌ల ద్వారా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కొనేలా శరీరానికి తోడ్పడుతుంది. కీళ్లవాతం, ఆస్థమా వంటి సమస్యలు తీవ్రం కాకుండానూ చూస్తుంది. చలికాలంలో ఫ్లూ, బ్రాంకైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లు.. కీళ్లనొప్పులు, ఉబ్బసం వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుండటానికి కారణం ఇదే కావొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. అందువల్ల చలి పెడుతుందని దుప్పటి ముసుగేసుకొని ఇంట్లోనే కూచోవటం కన్నా ఆరుబయట ఎండ నీడలో కాసేపు సేదతీరటం మంచిది.
మధుమేహానికి పగ్గం!
కేవలం విటమిన్ డి మూలంగానే కాదు.. నేరుగా సూర్యరశ్మి కూడా స్వీయ రోగనిరోధక జబ్బులు.. అంటే మన రోగనిరోధకశక్తి పొరపాటున మన మీదే దాడి చేయటం వల్ల తలెత్తే సమస్యల (మధుమేహం వంటివి) బారినపడకుండా కాపాడుతుంది. రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టీఎన్ ఆల్ఫా, ఇంటర్‌ల్యూకీన్ 10 వంటి సైటోకైన్లు అనవసరంగా ఉత్తేజితం కాకుండా ఎండలోని అతినీలలోహిత కిరణాలు నియంత్రణలో ఉంచుతాయి. రోగనిరోధక వ్యవస్థలోని ఇతర కణాలను అణిచి ఉండే టీ కణాల పనితీరు పుంజుకునేలా కూడా చేస్తుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి నియంత్రణ కోల్పోకుండా పనిచేస్తుంది. ఇవన్నీ స్వీయ రోగనిరోధక జబ్బులు తలెత్తుకుండా కాపాడతాయి.
సోరియాసిస్ నియంత్రణ
సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాల సమక్షంలో కాల్సిటోనిన్ జీన్-రిలేటెడ్ పెప్టైడ్ (సీజీఆర్‌పీ) విడుదలవుతుంది. ఇది చాలారకాల సైటోకైన్లను నియంత్రిస్తుంది. ఇలా రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించకుండానూ చూస్తుంది. అందువల్ల సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు నయం కావటానికి సూర్యరశ్మి తోడ్పడగలదని పరిశోధకులు చెబుతున్నారు.
చురుకుగా జీవక్రియలు!
మన శరీరంలో జీవక్రియలన్నీ ఒక లయబద్ధంగా సాగుతాయి. రాత్రవుతూనే నిద్ర ముంచుకొస్తుంది. తెల్లారగానే మెలవకు వచ్చేస్తుంది. భోజనం వేళకు కడుపులో ఆకలి రగులుతుంది. ఇవన్నీ ఠంచనుగా ఒక సమయానికి జరగటంలో మన ఒంట్లోని జీవ గడియారం (సర్కేడియన్ రిథమ్) తోడ్పడుతుంది. ఇది సజావుగా గాడి తప్పకుండా పనిచేటయంలోనూ సూర్యరశ్మి కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగా మన మెదడు మధ్యలోని హైపోథలమస్ గ్రంథిలో ప్రధాన జీవగడియారం (సుప్రాఖియాస్మాటిక్ న్యూక్లియస్) నిక్షిప్తమై ఉంటుంది. రోజంతా ఆయా వేళలకు అనుగుణంగా రకరకాల జీవక్రియలు జరగటానికి ఎప్పటికప్పుడు సంకేతాలు పంపిస్తుంటుంది. వీటిని ఆయా అవయవాలు, కణాల్లోని చిన్న చిన్న జన్యు గడియారాలు గ్రహించి అందుకు అనుగుణంగా స్పందిస్తుంటాయి. అందుకే జీవగడియారం దెబ్బతింటే ఇలాంటి క్రియలన్నీ అస్తవ్యస్తమవుతాయి. ఫలితంగా నిద్ర సమస్యలు, ఊబకాయం, రోగనిరోధకశక్తి తగ్గటం వంటివి సమస్యలు ముంచుకొస్తాయి. అయితే సూర్యరశ్మితో ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎందుకంటే రెటీనాలోని గ్యాంగ్లియాన్ కణాలకూ ప్రధాన జీవగడియారానికి నేరుగా సంబంధం ఉండటం గమనార్హం. రోజూ ఉదయం పూట ఒంటికి ఎండ తగిలేలా చూసుకుంటే జీవగడియారం అస్తవ్యస్తమైనా తిరిగి గాడిలో పడుతుందన్నమాట. జీవక్రియలన్నీ మళ్లీ పుంజుకుంటాయి.
జాగ్రత్తలు తప్పనిసరి
- ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం- వారానికి 2-3 సార్లు చర్మం మీద 5 నుంచి 15 నిమిషాల సేపు ఎండ పడేలా చూసుకుంటే విటమిన్ డి తగినంత తయారయ్యేలా చూసుకోవచ్చు. కానీ ముదురు చర్మం గల మనలాంటి వాళ్లు మరింత ఎక్కువసేపు ఎండ తగిలేలా చూసుకోవటం మంచిది. చర్మం మీద నేరుగా ఎండ పడితేనే విటమిన్ డి తయారవుతుంది.
- ఎండ తీవ్రంగా ఉంటే చర్మం వెంటనే చురుక్కుమంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఉదయం పూట ఎండ తగిలేలా చూసుకోవటం మంచిది. ఎండకాలంలో ఈ విషయాన్ని మరవరాదు.