దేశవ్యాప్తంగా చిన్న వయసులోనే గుండెపోటు బారినపడే వారి సంఖ్య పెరుగుతున్నట్లు పలు విశ్లేషణల ద్వారా స్పష్టమవుతోంది. 30 ఏళ్ల కిందట సుమారు 60 ఏళ్ల వారిలో వచ్చే గుండెపోటు(heart attack).. ఇప్పుడు 25-30 ఏళ్లలోనూ పోటెత్తుతోంది. దీనికి ఉప్పు అధిక వాడకం కూడా ప్రధాన కారణం. చిన్నతనంలోనే ఊబకాయం.. గతి తప్పిన ఆహారపు అలవాట్లు పలు రకాల జబ్బులకు దారితీస్తున్నాయి.
ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దలు వరకూ చిప్స్, సూప్‌లు, బర్గర్లు, పిజ్జాలు, సమోసాలకు అలవాటు పడుతున్నారు. ఇలా తినడానికి సిద్ధంగా ఉన్న(రెడీ టు ఈట్), నిల్వ ఉంచిన(ప్రాసెస్‌డ్ ఫుడ్) ఆహారాలన్నింటిలోనూ ఉప్పు(salt) ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అధికబరువును, గుండెపోటు తదితర ఆరోగ్యసమస్యలను కొని తెచ్చుకుని ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్/ఎఫ్‌డీఏ) ఉప్పు అతి వాడకంపై ఎదురవుతున్న అనర్థాలను పేర్కొంటూ.. బాల్యం నుంచే ఉప్పు వాడకాన్ని(salt usage) నియంత్రించాల్సిన అవసరముందని వివరిస్తూ.. తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. మన దేశంలోనూ ఇవి అనుసరణీయమని చెబుతున్నారు నిపుణులు.
ఎఫ్‌డీఏ మార్గదర్శకాలివీ..
తాజాగా అమెరికా ఎఫ్‌డీఏ మార్గదర్శకాల ప్రకారం.. నిల్వ ఆహారాల్లో ప్రస్తుతమున్న 3.4 గ్రాములు ఉప్పు శాతాన్ని.. 3 గ్రాములకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయని చెబుతూ.. అక్కడి ఆహార పరిశ్రమలకు సూచనలు చేశారు. బాల్యంలోనే ఉప్పు వాడకాన్ని నియంత్రణలో ఉంచుకుంటే.. వయసు పెరిగే కొద్దీ అది అలవాటుగా మారి ఆరోగ్యం బాగుంటుందని ఎఫ్‌డీఏ చెబుతోంది.
- ఇంట్లో వండే ఆహారాల్లో ఉప్పును నియంత్రణలో ఉంచుకోవాలి
- ఆహార పరిశ్రమల్లోనూ ఉప్పు వాడకాన్ని తగ్గించాలి
- ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో ఉప్పు శాతాన్ని బాగా కనిపించేటట్లుగా కవర్ పైభాగంలో ముద్రించాలి. అప్పుడు తాము ఎంత ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తింటున్నామనేది వినియోగదారులకు తెలుస్తుంది.
- ఉప్పు వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.
- పిల్లలకు సహజంగా ఉప్పు రుచి తెలియదు. మనమే బయటి నుంచి అలవాటు చేస్తాం. దాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. చిప్స్ వంటి చిరుతిళ్లకు బదులుగా ఒక పండును తినిపిస్తే వారికి ఎక్కువ పోషకాలు అందుతాయి.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర పౌష్టిక ముఖచిత్రం(న్యూట్రిషన్ ప్రొఫైల్)లో ప్రస్తావించిన అంశాల ప్రకారం.. 2019-20లో అయిదేళ్లలోపు చిన్నారులు 3 శాతం మంది.. 15-49 ఏళ్ల మహిళల్లో 30 శాతం, 15-54 ఏళ్ల పురుషుల్లో 32 శాతం మంది ఊబ కాయంతో బాధపడుతున్నారు. ఇదే విధంగా మహిళల్లో 20 శాతం మంది, పురుషుల్లో 27 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.
అధిక ఉప్పుతో రక్తపోటు, గుండెజబ్బు, పక్షవాతం..
"ప్రజారోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపే వ్యాధులను పరిగణనలోకి తీసుకుంటే.. ముందు వరుసలో నిలిచేది గుండెపోటు. దీనికి మూలాలను విశ్లేషిస్తే.. ప్రధాన కారణం రక్తపోటు. రాష్ట్రంలోనూ ఊబకాయులు, రక్తపోటు బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమే. బయటి ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల తమకు తెలియకుండానే ఉప్పును ఎక్కువగా స్వీకరిస్తున్నారు. ప్రధానంగా నిల్వ చేసిన ఆహారాల్లో రుచి కోసం, ఎక్కువ కాలం మన్నిక కోసం ఉప్పును మోతాదుకు మించి కలుపుతుంటారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో గుండెజబ్బు, పక్షవాతం, కిడ్నీ జబ్బుల వంటి వాటి బారినపడే అవకాశాలుంటాయి. కేవలం రక్తపోటు కారణంగానే కొన్ని లక్షల మందికి ప్రమాదకరమైన జబ్బులొస్తున్నాయి. అందుకే ఉప్పును నియంత్రణగా వాడుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం. మన ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆహార పరిశ్రమల్లో ఉత్పత్తి దశలోనే ఉప్పు వాడకాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. ఉప్పు వాడకం కనీసం 5 శాతం తగ్గించినా.. దేశం మొత్తమ్మీద పెద్దఎత్తున సానుకూల ఫలితాలొస్తాయి. దీనికి సంబంధించిన వ్యాధుల బారినపడే ముప్పు శాతం తగ్గుతుంది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సిన అవసరం తగ్గుతుంది. తద్వారా పని సమయాలు వృథా కావు. ఆర్థికంగానూ ఎనలేని మేలు చేకూరుతుంది."
- డాక్టర్ మనోహర్, విశ్రాంత ఆచార్యులు, జనరల్ మెడిసిన్ విభాగం, ఉస్మానియా వైద్యకళాశాల
వేర్వేరు రూపాల్లో శరీరంలోకి సోడియం
"ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి రోజుకు సగటున 5 గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పును తీసుకోవద్దు. అంటే ఒక టీ స్పూన్ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అప్పటికే గుండె, మూత్రపిండాల జబ్బులతో బాధపడుతున్న వ్యక్తి.. రోజుకు 3 గ్రాముల ఉప్పును మాత్రమే ఆహారంలో స్వీకరించాలి. కానీ బయటి ఆహారంలో ఎంత ఉప్పు ఉందనేది తెలిసే అవకాశమే లేదు. ఆహార పరిశ్రమల్లో రుచి కోసం ఉప్పును ఎక్కువగా వాడుతుంటారు. నిజానికి మన శరీరానికి అంత ఉప్పు అవసరం లేదు. పచ్చళ్లు, అప్పడాలు వీటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. రోజూ పచ్చడితో అన్నం తింటే.. అదే అలవాటుగా మారుతుంది. అప్పుడు ఉప్పు తక్కువైన ఆహారం వారికి రుచించదు. ఉప్పును కొందరు మజ్జిగలో, పెరుగులో, కూరగాయల ముక్కలపై, కూరలోనూ పై నుంచి వేసుకుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. సోడియం అంటే ఉప్పు ఒక్కటే కాదు. ఇంకా బేకరీ ఉత్పత్తుల్లో మోనో సోడియం గ్లూటమేట్, బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్, సోడియం సైట్రేట్, కోశెర్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ వంటి వాటిని ఎక్కువగా వాడుతుంటారు. ఉదాహరణకు బ్రెడ్‌లో ఉప్పు ఉండదు. కానీ అది తినడం ద్వారా కూడా సోడియం శరీరంలోకి చేరుతుంది."
- డాక్టర్ ఎస్తర్ సాతియారాజ్ హెడ్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ హెచ్‌సీజీ హాస్పిటల్స్, బెంగళూరు
ఇదీ చూడండి : పిల్లలు బరువు తగ్గాలా? అయితే ఇవి పెట్టండి!