What is The Perfect Time to Have Breakfast? : ఉదయాన్నే టిఫెన్ స్కిప్ చేయడం ఎంత ప్రమాదకరమో చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. దీనివల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తుంటారు. అంతేకాదు.. ఏం తినాలో కూడా సూచిస్తుంటారు. ఆయిల్ ఫుడ్ బదులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలంటూ ఎన్నో సలహాలు ఇస్తుంటారు. అయితే.. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన సమయంలో తినడం కూడా అంతే ముఖ్యమని సూచిస్తోంది.
ఇటీవల "నేచర్ కమ్యూనికేషన్స్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మీరు రోజులో తినే మొదటి భోజనం సమయం.. మీ గుండె ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. యూనివర్శిటీ సోర్బోన్ ప్యారిస్ నోర్డ్, బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకుల బృందం చేసిన పరిశోధన ప్రకారం.. మీరు ఉదయం ఎంత త్వరగా అల్పాహారం తీసుకుంటే, అది మీ గుండె వ్యవస్థ పనితీరును అంతగా మెరుగుపరుస్తుందని కనుగొన్నారు.
ప్రతి నిమిషానికీ పెరుగుతున్న ముప్పు..!
తప్పకుండా ప్రతి వ్యక్తీ ఉదయం 8 గంటల సమయం దాటకుండా టిఫెన్ ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయం దాటి ఎంత ఆలస్యంగా తింటే.. అంత మేర గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందట! ఉదాహరణకు.. ఒక వ్యక్తి తన బ్రేక్ ఫాస్ట్ ఉదయం 9 గంటలకు చేస్తున్నట్టైతే.. ఉదయం 8 గంటలకు తినే వారికన్నా సుమారు 6 శాతం ఎక్కువగా గుండె సంబంధింత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందట!
రాత్రి భోజనానికి మరింత ఎక్కువగా!
ఉదయం టిఫెన్తోపాటు రాత్రి భోజనానికీ ఇదే సూత్రం వర్తిస్తుందట! చాలా మంది రాత్రివేళ ఆలస్యంగా తింటూ ఉంటారు. కానీ.. రాత్రి 8 గంటలు దాటకుండా డిన్నర్ ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు రాత్రి వేళ ఎంత ఆలస్యంగా తింటే.. హృదయ సంబంధ వ్యాధులు అంత ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందట. రాత్రివేళ 8 గంటలలోపు తినే వారితో పోలిస్తే.. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత తినేవారిలో గుండె, సెరెబ్రోవాస్కులర్ వ్యాధుల ప్రమాదం ఏకంగా 28 శాతం పెరుగుతుందట!
ఉదయం టిఫెన్లో ఇవి తిన్నారంటే - ఆరోగ్యం నాశనమైపోతుంది!
ఆహారపు అలవాట్లతోపాటు, భోజన చేసే సమయం కూడా గుండె సంబంధిత వ్యాధులను కలిగిస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. కాబట్టి.. మంచి ఆహారం తీసుకోవడంతోపాటు సమయానికి తినడం కూడా చాలా ముఖ్యమని అంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రతీ సంవత్సరం దాదాపు 17.9 మిలియన్ల మంది గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్నారట. అందువల్ల.. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే అవసరమైన చర్యలను తీసుకోవడం చాలా ముఖ్యమని వారు సూచిస్తున్నారు.
ఈ తిండి వేళలు పాటిస్తూ.. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. శరీరానికి కనీస శ్రమ లేకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు కంటి నిండా నిద్రపోవాలని సూచిస్తున్నారు. రాత్రివేళ తగినంత నిద్రపోవడం వల్ల శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుందని చెబుతున్నారు. సమయానికి తినడం, వ్యాయామం చేయడం, రోజుకు 7 గంటలు తగ్గకుండా నిద్రపోవడం ద్వారా.. గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు.
DON'T SKIP BREAKFAST: టిఫిన్ మానేస్తున్నారా... అయితే ఇవి తప్పవు!!