కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో చరిత్ర, పురావస్తు శాస్త్రాల్లో సహాయ ఆచార్యులుగా పని చేస్తున్న వల్లూరు రామబ్రహ్మం కరోనాతో మృతి చెందారు. వారం రోజులుగా కర్నూలు ప్రైవేటు ఆసుపత్రిలో వెంటలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పురావస్తు శాసనాలను వెలికి తీయడంలో ఆయన తీవ్రంగా కృషి చేశారు.
2010లో కడప జిల్లా చింతకుంట వద్ద ఆదిమానవుల రేఖాచిత్రాలను కనుక్కొని.. దానిపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపడంలో కీలకపాత్ర పోషించారు. ఇటీవల ముద్దనూరు మండలంలో రేనాటి చోళుల కాలంనాటి అరుదైన శాసనాలను కనుగొన్నారు. కడప, కర్నూలు జిల్లాలో అనేక రేఖాచిత్రాలు ఉన్నట్లు తేల్చారు. ఆయన మరణం పట్ల విశ్వవిద్యాలయ ఉప కులపతి సూర్య కళావతి, అధ్యాపకులు సంతాపం తెలియజేశారు. రామబ్రహ్మం భార్య కూడా కరోనాతో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్దురాలు... కాపాడిన పోలీసులు