Ysrcp mla : వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని కొందరు కుట్ర పూరితంగా ఇరికించారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. కేసులో ఇరుక్కున్న తర్వాత అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయక తప్పదన్న రాచమల్లు.. వెంటనే ఆయన బెయిల్ పై బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పులివెందుల నుంచి కడపకు చేరుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి.. కడప ఆర్అండ్బీ అతిథి గృహంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి సహా జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వివేకా కేసులో తాజా పరిణామాలపై ఈ సమావేశంలో అవినాష్ రెడ్డి ముఖ్య నేతలతో చర్చించారు. కొందరు మహిళా నాయకులు అవినాష్ రెడ్డిని చేతులు పట్టుకుని కన్నీరు పెట్టారు. వివేకా కేసులో అనవసరంగా ఇరికిస్తున్నారని ధైర్యంగా ఉండాలని.. ఏమీ కాదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయితే ఏం చేయాలని దాని పైన కూడా అవినాష్ రెడ్డి ముఖ్య నాయకులతో చర్చించినట్లు సమాచారం. అవినాష్ రెడ్డి ఈ కేసులో దోషిగా తేలి న్యాయస్థానం శిక్ష వేస్తే జిల్లాలోని ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయడానికి సిద్ధమని గతంలో ప్రకటించిన సవాలుకు తాను కట్టుబడి ఉన్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. అవినాష్‌ను ఈ కేసులో ఇరికించడానికి చంద్రబాబు కుట్ర ఉందని రాచమల్లు ఆరోపించారు.
వైఎస్ వివేకా హత్యకు అవినాష్ రెడ్డికి సంబంధం లేదు. మనసా, వాచా, కర్మనా, అంతరాత్మ సాక్షిగా మాట్లాడుతున్నా.. నా మాటల్లో రాజకీయ కోణం లేదు. అవినాష్ రెడ్డి సౌమ్యుడు. ఒక మనిషిని బాధ పెట్టాలనుకునే వాడే కాదు.. అలాంటి వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేయడం, ఆధారాలు లేకుండా చేశాడని చెప్తుంటే ఎలా నమ్మాలి..? ఇదంతా రాజకీయ కుట్రగా భావిస్తున్నాను. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు.. దాని వెనుక ఉన్న వారిని బయటపెట్టేలా జరగడం లేదు.. కేవలం అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలన్నదే లక్ష్యంగా సాగుతోంది. తెర వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని నేను భావిస్తున్నా. ఇప్పటికే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు. తర్వాత అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేయొచ్చు. సాక్ష్యాలను ధ్వంసం చేసిన వారిలో అవినాష్ రెడ్డి పాత్ర కీలకం అని చెప్తున్నారు.. సహ ముద్దాయిగా ఉన్నందున తప్పకుంటా అరెస్టు చేయొచ్చు. ఆ తర్వాత న్యాయస్థానానికి వెళ్లి కడిగిన ముత్యంలా బయటికి తీసుకువస్తాం. మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. - ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి
ఇవీ చదవండి :