YCPs Attacks on Police in AP: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పోలీసులపై వైఎస్సార్సీపీ అల్లరిమూకలు వరుస దాడులు చేస్తున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. 24 గంటల వ్యవధిలోనే ప్రొద్దుటూరు, కడపలో పోలీసులపై దాడులు జరిగితే ఉన్నతాధికారులు రాజీకి యత్నించారు. మీడియా కథనాలు, ప్రజాసంఘాల ఆందోళనలతో ఎట్టకేలకు కేసులు నమోదు చేశారు. దీంతో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
YSRCP Attacks: నన్ను ఎమైనా అంటే నా అభిమానులకు బీపీ పెరుగుతుంది.. 'వైసీపీ దాడులపై' జగన్తీరు
సీఎం సొంత జిల్లాలో వరుసగా పోలీసులపై జరుగుతున్న దాడులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నెల 8న రాత్రి 11 గంటలకు ప్రొద్దుటూరు వన్ టౌన్ ఎస్సై హైమావతి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేయడానికి వెళ్లారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వైసీపీ అల్లరిమూకలు ఆమెపై రాళ్లదాడి చేశారు. ఆమెకు స్వల్ప గాయమవగా మొబైల్ ఫోన్ పగిలిపోయింది. 9వ తేదీన ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీని వెనుక వైఎస్సార్సీపీ నేతల హస్తం ఉందని అందుకే అల్లరి మూకలను పట్టుకోవడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ప్రొద్దుటూరు ఘటన జరిగిన 24 గంటల్లోనే కడపలో ఓ ఇంటిలిజెన్స్ సీఐపై దాడి జరిగింది. కడప ఆర్కే నగర్‌లో ఇంటిలిజెన్స్ సీఐ అనిల్ కుమార్ నివాసముంటున్నారు. ఆయన ఇంటి సమీపంలో మయూరా గార్డెన్ హోటల్‌లో పనిచేసే బిహార్, అసోం యువకులు ఉంటున్నారు. ఈనెల 9వ తేదీ రాత్రి 11 గంటల వేళ యువకులు దుకాణం వద్ద అల్లరి చేస్తుండగా అనిల్ కుమార్ వారిని మందలించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది.
హోటల్ నిర్వాహకుడు రాజగోపాల్ రెడ్డి కూడా సీఐపై దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. పదో తేదీ సీఐ భార్య శ్వేత జిల్లా ఎస్పీని కలిసినప్పటికీ ఘటనను చిన్నదిగా భావించి రాజీకి యత్నించారు. హోటల్ వైఎస్సార్సీపీ నేతలది కావడంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి యువకులపై కేసులు నమోదు చేయకుండా జాగ్రత్త పడ్డారు. మీడియాలో కథనాలు రావడంతో ఎట్టకేలకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. మయూరా గార్డెన్ హోటల్ నిర్వాహకుడు రాజగోపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఇంటిలిజెన్స్ సీఐ అనిల్ కుమార్‌తో పాటు ఆయనకు సహకరించిన మరో ఇంటిలిజెన్స్ సీఐ నాగరాజు, ఎస్సై శివప్రసాద్‌పై కడప ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అనిల్ కుమార్ ఫిర్యాదు మేరకు హోటల్ నిర్వాహకుడు రాజగోపాల్ రెడ్డితో పాటు ఇద్దరు యువకులపై మరో కేసు నమోదు చేసినట్లు కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారు.