YCP Corporators fire on kadapa Municipal officers: ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజలకు వరాలు కురిపిస్తుంటే.. మరోవైపు కడప నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు భయం కలిగిస్తున్నారని.. వైసీపీ కార్పొరేటర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్లకు తెలియకుండానే అధికారులు ఇష్టారాజ్యంగా పన్నులు వసూళ్లు చేయడంపై పాలకవర్గ సభ్యులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 40 మంది కార్పొరేటర్లు మున్సిపల్ కమిషనర్‌కు మూకుమ్మడిగా వెళ్లి వినతిపత్రం అందజేసి.. కడపలో జరుగుతున్న పన్నుల విధానంపై సీఎం జగన్‌కు లేఖలు రాయడం.. జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. గత కొంతకాలంగా కడప నగరపాలక సంస్థ అధికారులు వివిధ రకాల పన్నుల పేరుతో ముక్కు పిండి ప్రజల నుంచి డబ్బులను వసూలు చేస్తున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లే జీర్ణించుకోలేకపోతున్నారు. కడప నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉంటే అందులో 48 మంది వైసీపీ కార్పొరేటర్లే. వారిలో దాదాపు 40 మంది వరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్‌ను స్పందన కార్యక్రమంలో కలిసి ప్రజల సమస్యలను విన్నవించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది వీధుల్లోకి గుంపులు గుంపులుగా వెళ్లి ప్రజలను బెదిరించే ధోరణిలో పన్నులు వసూళ్లు చేయడం ఏంటీ? అని ప్రశ్నించారు. కడప కార్పొరేషన్‌లోకి శివారు గ్రామ పంచాయతీలు విలీనం అయ్యాయని.. వాటిని కూడా దృష్టిలో ఉంచుకుని పన్నులు వసూలు చేయకుండా.. అందరికీ ఒకే విధంగా భారీ స్థాయిలో పన్నులు వేస్తే ఎలా? అని మండిపడ్డారు. అధికారుల తీరుపై చాలాసేపు మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్‌తో కార్పొరేటర్లు వాదించారు. కార్పొరేటర్లకు తెలియకుండానే అన్నీ జరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి చెత్త పన్ను 40 రూపాయలు, 60 రూపాయలుగా పాలకవర్గం తీర్మానించి పంపినప్పటికీ.. అధికారులు మాత్రం 90 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. 2019-20 సంవత్సరంలో కరోనా సందర్భంగా వ్యాపారాలు జరగని వారికి కూడా ట్రేడ్ లైసెన్స్ పేరుతో భారీగా పెనాల్టీ వేయడం సరికాదని కమిషనర్‌ను ప్రశ్నించారు.
ఇంటి పన్నులు, నీటి పన్నులతో పాటు ఖాళీ స్థలాలకు కూడా వీఎల్టీ పేరులో టాక్స్ భారీగా వేస్తే ఎలా? అని ప్రశ్నించారు. ప్రకటనల పేరుతో, ఇంప్రూవ్‌మెంట్ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ వంటి వాటిపై సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. గతంలో మైక్రో ఫైనాన్స్ తరహాలో ప్రజలను వేధించి పన్నులు వసూలు చేయడం మంచిది కాదని.. కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. కమిషనర్ ఐఏఎస్ అధికారి కావడంతో.. నిబంధనల ప్రకారం వెళ్తున్నారని.. కానీ కడపలో సామాన్య ప్రజలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. కమిషనర్ చెప్పారనే ఉద్దేశంతో అధికారులు ప్రజలను వేధిస్తే పాలన గాడితప్పడమే కాకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కడప నగరపాలక సంస్థ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరుతూ కార్పొరేటర్లు సీఎం జగన్ కు లేఖ రాశారు. సీఎం జగన్ పేదలకు వరాలు అందిస్తుంటే.. ఆయన సొంత జిల్లా కడపలో మాత్రం అధికారులు భయాన్ని ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నగరంలో జరిగిన అన్ని విషయాలను మేయర్, ఉప ముఖ్యమంత్రి, ఎంపీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. పన్నుల భారం మోయలేమని రెండేళ్ల నుంచి ప్రజలు, ప్రజా సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ఇపుడు ఏకంగా వైసీపీ కార్పొరేటర్లే ఆ బాట పట్టడం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మరీ సంఘటనపై సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారోనని కడప జిల్లా ప్రజలు, వైసీపీ కార్పొరేటర్లు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి