కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ రంగంలో ఉద్యోగులకు ఉపాధి కరవవుతోంది. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల పరిస్థితి దయనీయంగా మారింది. ఫలితంగా దినసరి కూలీలుగా కొందరు మారుతున్నారు. కడప జిల్లా ఖాజీపేట మండలం తవ్వారిపల్లెకు చెందిన తవ్వా వెంకటయ్య పరిస్థితి అదే. పీహెచ్‌డీ చేసి ప్రైవేట్ కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేసి వచ్చే మొత్తంతో కుటుంబాన్ని పోషించుకునే వారు.
కథా రచయిత, పరిశోధకుడైన వెంకటయ్య వ్యాకరణబోధిని, వ్యాసధార, యువతరం, సీమ కథా తొలకరి, రాయలసీమ తొలితరం రచనలు చేశారు. పలువురి నుంచి మెప్పు పొందారు. సత్కారాలు అందుకున్నారు. 2010లో యోగివేమన విశ్వ విద్యాలయం నుంచి రాయలసీమ కథానిక-తొలిదశ-ఒక అధ్యాయం అనే అంశంపై పరిశోధన చేసి 2014లో పీహెచ్‌డీ పొందారు. కరోనా ప్రభావంతో ప్రైవేట్ కళాశాలలు మూతపడటం కారణంగా ఉపాధి కరవైంది... జీవనం కష్టమైంది. చదువుకునే సమయంలో చేసిన పని అనుభవంతో తిరిగి బేల్దారు వృత్తిని ఎన్నుకున్నారు. ఉపాధి పొందుతున్నారు. ఉన్నత చదువులు చదువుకున్నామని, పీహెచ్‌డీ చేశాననే అహం లేకుండా కష్టపడుతున్నారు. వచ్చే మొత్తంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఇదీ చదవండి: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కథేంటి?