ద్విచక్రవాహనాలు, కార్లు మహిళలు నడపడం సర్వసాధారణమే...అయితే రవాణా వాహనాలు నడపాలనే ఆలోచన చాలామందికి అరుదుగా వస్తుంది. ఆ కోవలోకే చెందుతారు కడపకు చెందిన నజీనాబేగం. ఎంఏ, బీఈడీ చదివిన ఆమె ఏడాదిన్నర పాటు లెక్చరర్‌గా పని చేసింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఎన్నో ప్రయత్నాలు చేసిన నజీనాబేగం.. ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం సాధించేందుకు సిద్ధమవుతోంది. డ్రైవింగ్‌పై ఉన్న మక్కువతో అనతికాలంలోనే డ్రైవర్ శిక్షణలో ఎన్నో మెలకువలు నేర్చుకున్న ఆమె రోడ్డుపై ఆర్టీసీ బస్సును పరుగులు పెట్టిస్తోంది.
మొత్తం 16 మంది డ్రైవింగ్ శిక్షణ తీసుకుంటుండగా...వారిలో నజీనాబేగం ఒక్కరే మహిళ కావడం విశేషం. ఏ మాత్రం అధైర్యపడకుండా పురుషులతో సమానంగా ఆర్టీసీ బస్సు డ్రైవింగ్ శిక్షణలో రాణిస్తోంది. కుటుంబానికి చేదోడుగా ఉంటూనే... ఏదో రంగంలో ఉద్యోగం సంపాదించాలని బలమైన కోరిక తనలో ఉందన్నారు నజీనాబేగం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే డ్రైవింగ్ శిక్షణ తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రతి పార్లమెంట్ పరిధిలో ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ ఇస్తోంది. లైట్ వెహికల్ లైసెన్స్ కల్గిన వారు... హెవీ వెహికల్ లైసెన్స్ సాధిస్తే ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా ఉపయోగపడతారని శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే కడప జిల్లాలో ఇద్దరు మహిళలు, తిరుపతిలో ఇద్దరు, విజయనగరంలో ఒక మహిళ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. నజీనా బేగం శిక్షణకు వచ్చిన వారం రోజుల్లోనే... ఏమాత్రం బెరుకు లేకుండా ధైర్యంగా స్టీరింగ్ తిప్పుతోందని శిక్షకులు అంటున్నారు. భారీ వాహనాలు నడిపేందుకు ఇప్పుడిప్పుడే మహిళలు సైతం ముందుకు వస్తున్నారు. ఇకపై త్వరలోనే ఆర్టీసీ బస్సులను సైతం మహిళలు నడిపే రోజులు రానున్నాయి. నజీనాబేగం లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు మహిళలు ముందుకొచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: