కడప జిల్లా మైదుకూరులోని ఎస్‌బీఎస్‌వైఎన్ డిగ్రీ కళాశాల గతంలో ఇచ్చిన సమ్మతిని వెనక్కి తీసుకుంది. దీంతో ఆ కళాశాలను ఎయిడెడ్‌గా నిర్వహించుకునేందుకు కమిషనర్ పోలా భాస్కర్ అనుమతి మంజూరు చేశారు. గతంలో బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగిస్తూ యాజమాన్యం అంగీకార పత్రం ఇచ్చింది. తాజాగా ప్రభుత్వం పునఃసమీక్షించుకునే అవకాశం కల్పించడంతో యాజమాన్యం.. ఆర్జేడీకి ఉపసంహరణ దరఖాస్తు చేసింది. ఈ కళాశాలకు చెందిన సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు, యథావిధిగా ఎయిడెడ్‌గా కొనసాగేందుకు కమిషనర్ అనుమతించారు. ప్రభుత్వం ఆదేశాలు జారీచేశాక సమ్మతిని వెనక్కి తీసుకునేందుకు అనుమతి పొందిన మొదటి కళాశాల ఇదే. రాష్ట్రంలో 137 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. వీటిల్లో ఆరు ఆస్తులతో సహా సిబ్బందిని అప్పగించేందుకు సమ్మతించాయి. ఏడు కళాశాలలు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. మిగతావి సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి.
ఎయిడెడ్ జేఎల్స్ కౌన్సెలింగ్ 18న
ఎయిడెడ్ జూనియర్ లెక్చరర్లకు ఈనెల 18న కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఎయిడెడ్ యాజమాన్యాల సమ్మతి మేరకు ప్రభుత్వంలో విలీనమైన సిబ్బందికి బదిలీ చేయనున్నారు. కాంట్రాక్టుసిబ్బంది పనిచేస్తున్న పోస్టులు మినహా మిగతా ఖాళీలను కౌన్సెలింగ్‌లో ప్రదర్శించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Pawan on Aided Schools: ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి: పవన్