కడప జిల్లాలో చిన్న, మధ్య, పెద్ద జలాశయాలు 15 ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 84.745 టీఎంసీలు. సుమారు 4.51 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కొన్నేళ్లుగా ఖరీఫ్, రబీ సీజన్‌లో చూస్తే ఉన్న ఆయకట్టులో కనీసం 50 శాతం కూడా నీరివ్వలేని పరిస్థితి నెలకొంది. ఈసారి కుండపోత వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దశాబ్దం తర్వాత జలకళ ఉట్టిపడుతోంది. ప్రస్తుతం 64.945 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. బీడుగా ఉన్న భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు సరైన కార్యాచరణ ప్రణాళికతో జలవనరుల శాఖ సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
సాగునీటి భరోసా ఎన్నడు?
జిల్లాలో అన్నమయ్య, దిగువ సగిలేరు, పింఛ, వామికొండ, సర్వరాయసాగర్, పైడిపాళెం జలాశయాల పరిధిలో వేలాది ఎకరాలకు సేద్యపు జలాలు ఇవ్వాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా చూస్తే పరిహారం చెల్లింపు, భూసేకరణ సమస్య కారణంగా నిర్దేశిత లక్ష్యం మేరకు భూములకు నీరందలేదు. ఏటా రూ.కోట్లు కుమ్మరిస్తున్నా సాగునీటికి భరోసా లభించలేదు. జలాశయాల నిర్మాణంపై మన పాలకులు, సాంకేతిక నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ప్రాజెక్టుల నుంచి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులు పంటలు పండించుకునేలా ఏర్పాట్లు చేయడం లేదు.
ఆయకట్టుకు సాగునీరిస్తాం...
తెలుగుగంగ పథకం ద్వారా జిల్లాలో 1.77 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని అప్పట్లో లక్ష్యాన్ని నిర్దేశించారు. ఎస్సార్-1, ఎస్సార్-2 బ్రహ్మంసాగర్ పరిధిలో ఇప్పటికే 1,58,657 ఎకరాలను గుర్తించాం. సాగునీటి సరఫరా వ్యవస్థను 1,28,214 ఎకరాలకు సిద్ధం చేశాం. ఈ సారి 1.02 లక్షల ఎకరాలకు నీరివ్వాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. కొన్నిచోట్ల భూసేకరణ సమస్య, పంట, పిల్ల కాలువల నిర్మాణానికి క్షేత్ర స్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. - శారద, ఎస్‌ఈ, తెలుగుగంగ ప్రాజెక్టు
ఇదీ చదవండి: