కడప జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. జిల్లాలో 50 మండలాలు ఉండగా ఇప్పటికీ 24 మండలాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 376 పల్లెలకు... 250 ట్యాంకర్ల ద్వారా రోజు 4,840 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ రోజురోజుకు నీటి సమస్య పెరుగుతుంది. కొన్ని గ్రామాల్లో తాగునీటి పథకాలు అడుగంటిపోగా.. మరికొన్ని చోట్ల మోటార్లు కాలిపోయాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు మైళ్ల కొద్దీ నడవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలోని రాయచోటి, చిన్నమండెం, సంబేపల్లి, గాలివీడు, చిట్వేలి, లక్కిరెడ్డిపల్లి, చక్రాయపేట, వీరబల్లి, సుండుపల్లి, రామాపురం, పెనగలూరు, మైదుకూరు, పుల్లంపేట, కాశి నాయన, రాజంపేట, పెండ్లిమర్రి మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది.
నిధులు మంజూరు చేయాలి
అధికారులు గ్రామాల్లో జనాభా ఆధారంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. లాక్డౌన్ కారణాలు చూపుతూ క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయకపోవడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదు. రాయచోటిలోని వెలిగల్లు, రోళ్లమడుగు వంటి పథకాలున్నా అవి అడుగంటిపోయాయి. 2019లో తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టిన పనులకు సంబంధించి రూ.30 కోట్లు నిధులు చెల్లించాల్సి ఉన్నా... కేవలం రూ.11.15 కోట్లు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. వేసవిలో చేపట్టిన పనులకు ప్రత్యేక ప్రణాళిక ప్రకారం నిధులు మంజూరు చేస్తే తప్ప.. పల్లె, పట్టణ జనానికి తాగునీరు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకొని జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి :
హైదరాబాద్లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలా?: శ్రీకాంత్ రెడ్డి