మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 13వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వివేకా ప్రధాన అనచరుడు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. వరుసగా మూడోరోజు ఎర్ర గంగిరెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ప్రతిరోజూ దాదాపు 7 గంటలకు పైగానే విచారిస్తున్నారు.
సాక్ష్యాల తారుమారు అభియోగాలపై...
వివేకాకు అత్యంత సన్నిహితుడుగా పనిచేసిన ఎర్ర గంగిరెడ్డి.. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిన రోజు ఆయన ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలపై రెండేళ్ల కిందటే సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పైన ఉన్న ఎర్ర గంగిరెడ్డిని అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు.
సుదీర్ఘ విచారణ చర్చనీయాంశమైంది..
వివేకాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, రాజకీయాలు అన్నీ కూడా ఎర్ర గంగిరెడ్డి కనుసన్నల్లోనే జరిగేవనే ఆరోపణలు ఉన్నాయి. వివేకా ఎక్కడికి వెళ్లినా ఎర్ర గంగిరెడ్డి తోడుగా వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో వివరాల సేకరణకు ఇతన్ని గతంలోనే సిట్ అధికారులు గుజరాత్ తీసుకెళ్లి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించారు. ఇపుడు సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తుండటం చర్చనీయాంశమైంది. హత్య జరిగిన రోజు గదిలో సాక్ష్యాధారాలు ఎందుకు చెరిపి వేయాల్సి వచ్చిందనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు వివేకాకు ఎర్ర గంగిరెడ్డితో ఉన్న సంబంధాలు, ఆర్థిక విషయాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి..