Vijayasai Reddy: ‘పుట్టిన ప్రతి మనిషీ గిట్టక మానడు, మీకు తెలుసు కదా.. అందరం పోయేవాళ్లమే. ఎవ్వరం శాశ్వతం కాదు’ అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం వైయస్‌ఆర్ జిల్లా చాపాడు సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్‌మేళా పోస్టరు ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కొందరు సాక్షులు చనిపోతారని తాము ముందే చెప్పినట్లు ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారని ఓ విలేకరి ప్రశ్నించగా.. విజయసాయిరెడ్డి పైవిధంగా సమాధానమిచ్చారు. మరణానికి, కేసుకు ముడిపెట్టడం, ప్రతిదాన్నీ రాజకీయ కోణంలో చూడటం చంద్రబాబు, లోకేశ్‌కు అలవాటుగా మారిందన్నారు. జులై 8, 9తేదీల్లో వైకాపా ప్లీనరీ జరుగుతుందన్నారు. రాష్ట్రపతి ఎన్నికపై పార్టీ వైఖరిని ముఖ్యమంత్రే నిర్ణయిస్తారని చెప్పారు.
లోకేశ్ సవాల్ స్వీకరిస్తున్నాం.. నారా లోకేశ్ పదోతరగతి విద్యార్థులతో నిర్వహించిన జూమ్ సమావేశాన్ని వారికే తిప్పి కొట్టామని, ఇది ఆరంభమేనని, తగిన గుణపాఠం నేర్పిస్తామని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ భవానీపురంలో వైకాపా ఎన్టీఆర్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ లోకేశ్ పారిపోవటం సమాధానం కాదని, ప్రశ్నించాలన్నారు.
నేరుగా ముందుకు రావాలన్న ఆయన సవాలును తాము స్వీకరిస్తున్నామన్నారు. కొన్ని కారణాల వల్లనే విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేరని, ఆరోగ్యం బాగోలేకపోవడం తదితర కారణాలతో గతంలో తానూ ఇంటర్మీడియట్ ఫెయిలయ్యానని విజయసాయిరెడ్డి తెలిపారు.
విభజన హామీల్లో ఎన్ని నెరవేర్చారో భాజపా నాయకులే చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండు చేశారు. మిగిలిన రాష్ట్రాల్లాగే ఇస్తున్నారు తప్ప అదనంగా ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇవ్వాల్సినవి ఇవ్వకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, అంబటి రాంబాబు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: