నిరుద్యోగ యువతకు ద్రోహం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం పోటీపడి నిరుద్యోగ యువతకు ద్రోహం చేస్తున్నాయని తులసిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే..కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోని 8,72,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఖాళీగా ఉండడం దురదృష్టకరమన్నారు. 2020 మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల సంఖ్య 40 లక్షల 4941 కాగా..అందులో 31 లక్షల 32,698 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని 8,72,243 లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కూడా అదేరీతిలో యువతకు ద్రోహం చేస్తోందని తులసిరెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రంలో దాదాపు 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉండగా..గడిచిన రెండు సంవత్సరాలలో కంటితుడుపు చర్యగా 11,308 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని దుయ్యబట్టారు. 2122 ఆర్థిక సంవత్సరానికిగానూ 10,143 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలన్న ఆశయంతో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రారంభించిందని గుర్తుచేసారు. జగన్ ప్రభుత్వం పేరుమార్చి జగనన్న విద్య దీవెన అని పేరు పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో 77 ను ఉపసంహరించుకోవాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి