లక్ష కోట్ల రూపాయలతో అమరావతిని నిర్మించలేమన్న ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పందించారు. విశాఖలో రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడడానికే... జగన్ రాజధానిని మారుస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతిపై 1.09 లక్షల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ప్రభుత్వం వద్ద లేదని సీఎం చెప్పడంలో వాస్తవం లేదన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికే...ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. కడప జిల్లా వేంపల్లెలో మాట్లాడిన తులసిరెడ్డి... సచివాలయం, అసెంబ్లీ భవనాలు అమరావతిలో సర్వాంగ సుంధరంగా పూర్తయ్యాయన్నారు.
సచివాలయం వంద శాతం పూర్తి
రాజధానికి గుండెకాయ లాంటి సచివాలయం భవనాలు నూటికి నూరు శాతం పూర్తయ్యాయని... అక్కడి నుంచే నాలుగు ఏళ్లుగా పాలన సాగుతోందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల సచివాలయాల కన్నా అమరావతి సచివాలయం ఆధునికంగా, సౌకర్యంగా ఉందని చెప్పారు. రాజధానిలో ప్రధాన విభాగమైన అసెంబ్లీ భవనం అనేక రాష్ట్రాల కంటే అందంగా, ఆకర్షణీయంగా ఉందని తులసిరెడ్డి పేర్కొన్నారు.మంత్రులు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారుల నివాసా సముదాయాల 70శాతం పూర్తయ్యాయని.. మరో 5 వేల కోట్లు ఖర్చు చేస్తే అన్ని మౌలిక సదుపాయాలతో అద్భుతమైన రాజధానిగా అమరావతి తయారవుతుందన్నారు.
రైతుల నుంచి సమీకరించిన 33 వేల ఎకరాల్లో... ప్రభుత్వ భవనాలు, మౌలిక వసతులు, రైతులకు కేటాయించగా... మిగిలిన భూమిని విక్రయించుకున్నా..90వేలకోట్లు సమకూరుతాయన్నారు.
ఇదీ చూడండి: రాజధాని అంశంపై బిల్లుపై 8 మంది సభ్యులతో సెలెక్ట్ కమిటీ