కడప జిల్లా యర్రగుంట్లలో ఇండియా సిమెంట్ లిమిటెడ్ విశ్రాంత ఉద్యోగి వెంకటరమణయ్య దారుణహత్యకు గురయ్యారు. నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఆయన... ఇవాళ శవమై కనిపించారు. ఎర్రగుంట్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముసలయ్య ఇంట్లో వెంకట రమణయ్య మృతదేహం లభ్యమైంది. కాగా ఇంట్లో మొండెం మాత్రమే లభ్యం కాగా... అతని తల కడప శివారులోని గువ్వలచెరువు ఘాట్‌లో పాతిపెట్టినట్లు ముసలయ్య అంగీకరించాడు. దీంతో ముసలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గువ్వల చెరువు ఘాట్ వద్ద వెంకటరమణయ్య తలను గుర్తించారు. తలను టిఫిన్ బాక్స్‌లో పెట్టి లోయలో పడేసినట్టుగా నిర్థరించారు. పోలీసులు అక్కడకు చేరుకుని టిఫిన్ బాక్స్‌లో ఉన్న వెంకటరమణ తలను స్వాధీనం చేసుకున్నారు.
మృతుడు వెంకటరమణయ్య ఎర్రగుంట్లలో చాలామందికి వడ్డీలకు అప్పు ఇచ్చారు. ఈ లెక్కన ముసలయ్యకు కూడా దాదాపు 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు అప్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. డబ్బులు చెల్లించాలని పలుమార్లు అడిగినా ముసలయ్య స్పందించలేదు. దీంతో ఈనెల 20న మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 22న వెంకటరమణయ్య కనిపించడం లేదని అతని కుటుంబసభ్యులు ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవీ చదవండి: పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత: గుంటూరు జిల్లాలో తెదేపా నేతపై దాడి